కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా..? ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పోలీసు ఉన్నతాధికారుల భేటీలో ఏయే అంశాలపై చర్చించారు..?
పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణతో పాటు ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ నిర్వహించడంతో పొలిటికల్ సర్కిల్లో ఈ అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వారు బీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ నేరానికి ఒడిగట్టినట్టు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కీలకపాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇండియాకు రప్పించే విషయంపై ఈ భేటీలో ఉన్నతాధికారులతో రేవంత్ ఏమైనా చర్చించారా అనే చర్చ జరుగుతోంది.
ఈ కేసులో ప్రభాకర్ రావు కీలకం.దాంతో ఆయనను ఇండియాకు తీసుకొచ్చాకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లీడర్లకు నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలు ఉండటంతోనే కొద్దికాలంగా ఈ వ్యవహారంలో స్పీడ్ తగ్గిందని, ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు ఉండనున్నాయని ప్రచారం నేపథ్యంలో రేవంత్ ఈ అంశంపై రివ్యూ నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. స్వయంగా తన ఫోన్ ను ట్యాప్ చేసినట్లు తేలడంతో ఆగ్రహంగా ఉన్న రేవంత్…దోషులకు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే రేవంత్ నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి అనేది తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.