తెదేపా కొండగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు కొందరు ఈరోజు మంత్రి లక్ష్మా రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. కొండగల్ మండల పరిషత్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి కొందరు తెదేపా స్థానిక నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరారు. ఇది తెదేపా కంటే రేవంత్ రెడ్డికే పెద్ద షాక్ అని చెప్పకతప్పదు. తెరాస ప్రభుత్వం ఓటుకి నోటు కేసుతో రేవంత్ రెడ్డికి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఆయనపై కంటే ఆయన అనుచరులపైనే బాగా ప్రభావం చూపినట్లుంది. తెదేపాలో కొనసాగుతూ అధికార తెరాసను డ్డీకొంటూ ఇబ్బందులుపడేకంటే, అధికార పార్టీలోకి షిఫ్ట్ అయిపోతే గుర్తింపు, చేతిలో అధికారం అలాగే తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు తెరాస ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉంటుందనే ఆలోచనతోనే సరయిన అవకాశం, ఆఫర్ వచ్చినప్పుడు కాంగ్రెస్, తెదేపా నేతలు తెరాసలోకి దూకేస్తున్నట్లున్నారు.
దాని వలన ఆ రెండు పార్టీలు చాలా బలహీనపడుతున్నప్పటికీ, ఆ రెండు పార్టీలకి చెందిన నేతలను తెరాసలోకి ఆకర్షించడానికి కేసీఆర్ వారికి మంచి పదవులు ఆఫర్ చేస్తుండటంతో తెరాసలో అసంతృప్తి రగులుకొంటోంది. నెల రోజుల క్రితం తెరాసలో చేరిన కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కి క్యాబినెట్ హోదాగల ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించడంతో చిరకాలంగా పార్టీని అంటిపెట్టుకొనున్న సీనియర్లు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారని సమాచారం. పార్టీలో యూటి బ్యాచ్, బిటీ బ్యాచ్ అంటూ రెండు బ్యాచులు లేవని అందరూ బంగారి తెలంగాణా బ్యాచ్ కి చెందినవారేనని డి.శ్రీనివాస్ చెప్పడమే పార్టీలో అసంతృప్తి నెలకొని ఉందని స్పష్టం చేస్తున్నట్లుంది. కనుక తెదేపా నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరితే దాని వలన తమ పార్టీకి ఎంత నష్టం కలుగుతోందో తెరాసకు కూడా అంతే నష్టం జరుగుతోందని తెదేపా నేతలు సర్దిచెప్పుకొంటున్నట్లు సమాచారం.