రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ నగరాల పేర్లు చెప్పి అలా చేస్తామని చెప్పేవారు. అలా చేయాలని వారు అనుకున్నారు కానీ ఎవరి వల్లా కాలేదు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాంటి కబుర్లే చెబుతున్నారు. రేవంత్ ఈ సారి ప్రత్యేకమైన థీమ్ ఎంచుకున్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన థేమ్స్ నది అందాల్ని చూసి ముచ్చటపడి..మూసీని కూడా అలా చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా చర్చలు ప్రారంభించారు.
లండన్ గురించి తెలిసిన ఎవరికైనా నగరం మధ్యలో నుంచి ప్రవహించి థేమ్స్ నది గురించి తెలుస్తుంది. లండన్‌కు థేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. హైదరాబాద్ నగరం మధ్య నుంచి మూసి ప్రవహిస్తుంది. కానీ తెలియని వాళ్లు దాన్ని డ్రైనేజీ కాలువ అనుకుంటారు. ఆ పరిస్థితిని మార్చాలని చాలా ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు కొత్త సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రయత్నం చేయాలని డిసైడయ్యారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన థేమ్స్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేయాలని సంకల్పించారు.
మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్న్ారు.
అయితే లండన్ కు ఉన్నంత నిధుల లభ్యత, వెసులుబాటు.. ప్రజల బాధ్యత హైదరాబాద్ లో ఉండటానికి రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. కానీ ఇలాంటి ప్రకటనలు ముందే చేయడం వల్ల.. ఇతర పార్టీలు ట్రోలింగ్ చేయడానికి తప్ప దేనికీ ఉపయోగపడవు. ఇంకా ఐదేళ్ల సమయం ఉంది కాబట్టి.. పనులు ప్రారంభించిన తర్వాత చెప్పుకున్నా కాస్త బెటర్ గా ఉంటుందన్న అభిప్రాయం ఉంది.