పొట్టచేత పట్టుకుని ఎడారి దేశాలకు పోయే వారిలో తెలంగాణ ప్రజలు అధికంగానే ఉంటరు. దేశం దాటిపోయారు కాబట్టి వారి గురించి మాకెందకన్నట్లుగా గత ప్రభుత్వాలు వ్యవహరించాయి. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను పట్టించుకోలేదు. అయితే ఇలాంటి కార్మికులు, వారి కుటుంబాల సంఖ్య తక్కువేమీ లేదు. దీన్ని గుర్తించిన రేవంత్ సర్కార్.. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల ఎమ్మెల్యేలు, నేతల నుంచి ఇప్పటికే అభిప్రాయాలు తీసుకున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలన్నదానిపై అనేక మంది సూచనలు చేశారు. చనిపోయిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలో, కళాశాలలో చదవాలని అనుకునే వారికి 100 శాతం ఫీజు రాయితీతో అడ్మిషన్ ఇప్పించనున్నారు.
ఇక ఏజెంట్ల మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి. కేరళ రాష్ట్రంలో దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ ఉందని, వారి పాలసీని అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రజావాణిలో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. గల్ఫ్ కార్మికుల వల్ల పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం దేశానికి వస్తోంది. తెలంగాణకూ వస్తోంది. వారికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల రెండు విధాలుగా లాభం జరుగుతుందన్న అంచనాలో ఉన్నారు. ఈ విషయంలో అన్ని పనులు పూర్తయితే రేవంత్ గల్ఫ్ గోల్ కొట్టినట్లే అనుకోవచ్చు.