తెలంగాణలో ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుల్లో పదవిలో ఉన్న కేసీఆర్ తర్వాత పదవి , అధికారం లేని రేవంత్ రెడ్డి రెండో స్థానంలో ఉంటారు. ఆయన చాలా వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేయాల్సి ఉంది. అన్ని పార్టీలతో పాటు సొంత పార్టీ టార్గెట్ కూడా ఆయనే. పార్టీకి భారంగా మారిన సీనియర్లు.. ప్రజల్లో పలుకుబడి లేని నేతలు ఇప్పుడు రేవంత్‌పై దండెత్తుతున్నారు. ఠాగూర్, రేవంత్ రెడ్డి వ్యూహకర్త సునీల్ కనుగోలుపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు.
మునుగోడులో పార్టీ మారుతున్న వారంతా కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వారే పార్టీ నుంచి ఇతర పార్టీలకు పంపిస్తున్నారని భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి స్వయంగా మునుగోడులో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అభ్యర్థి ఎంపికే ఆయనకు సవాల్‌గా మారింది. నల్లగొండలో పెద్దారెడ్లుగా చెప్పుకుంటూ పార్టీ మీద సవారీ చేస్తున్న నేతలు ఇప్పుడు మునుగోడులో కనిపించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఆ పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. రేవంత్‌తో ఢిల్లీలో మళ్లీ కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులివ్వడాన్ని ఆ పార్టీ నేతలు నమ్మడం లేదు. కాంగ్రెస్ లో ఉంటూ తమ్ముడి గెలుపు కోసం ఆయన పని చేస్తారని అనుమానిస్తున్నారు. ఆయనకు ఎలాంటి బాధ్యతలిచ్చినా నమ్మలేని పరిస్థితి.
మునుగోడులో రేవంత్ రెడ్డి లీడ్ తీసుకుంటున్నారు. ఆయన అక్కడే మకాం వేసి ఎన్నికలను టార్గెట్ చేస్తే.. అది ప్లస్ అయినా మైనస్ అయిన రేవంత్ కే వస్తుంది. అయితే ఆయన బీజేపీ, టీఆర్ఎస్తో మాత్రమే కాదు.. సొంత పార్టీ కాంగ్రెస్ నేతలందరితో పోరాడాలి. ఎందుకంటే కాంగ్రెస్‌ను ఓడించేందుకు… వారు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తారు. అందులో సందేహం లేదు. అందుకే రేవంత్ రెడ్డి భవితవ్యాన్ని మునుగోడు తేల్చనుంది.