తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తన కంటే మాస్ లీడర్ ఎవరూ లేరని రేవంత్ రెడ్డి నిరూపించారు. ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా… ఆయన పాదయాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. రావిర్యాల సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించగలిగారు. ఓ ప్రణాళిక ప్రకారం… పార్టీ హైకమాండ్‌కు తన బలాన్ని చూపించగలిగారు. రేవంత్‌కు పోటీగా అని చెప్పుకుంటున్న నేతలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. భట్టి విక్రమార్క్ కూడా యాత్ర చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్ర చేస్తానంటున్నారు. మినీ పాదయాత్ర సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఏఐసిసి పర్మిషన్‌తోనే.. పాదయాత్ర చేస్తానని ఆయన చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచే పాదయాత్ర చేస్తారనే ప్రచారం ఉంది. కాంగ్రెస్‌లో సొంత నిర్ణయాలు కుదరవు. ఢిల్లీలో పర్మిషన్తెచ్చుకోవాలి. కానీ రేవంత్ పాదయాత్ర చేస్తే.. సీనియర్లుగా తామేం చేయాలని…తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డు పడటంతో అనుమతి దక్కలేదు. అనూహ్యంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని పార్టీ హైకమాండ్ నిర్దేశించింది. ఆ ప్రకారం.. రేవంత్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. తన బలప్రదర్శన చేశారు. ఇప్పుడు పార్టీ నేతలు.. హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ… జనంలో లేని నేతలు చేసే ఫిర్యాదులను హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంటుందా అన్నది ఇప్పుడు కీలకం.
రేవంత్ బల ప్రదర్శన చేస్తున్నారని అంచనాకు వచ్చిన తరవాత ఆయన వ్యతిరేక వర్గం.. రావిరాల సభను ఫెయిల్ అయ్యేలా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. రేవంత్ సభకు హాజరుకావద్దని క్యాడర్‌కు నేరుగా సీనియర్లు ఆదేశాలు పంపారు. అయినా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు రేవంత్ వెంట నడిచారు. దీంతో రేవంత్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తే మొత్తం పార్టీ కేడర్ అంతా ఆయన వెంట నడుస్తుందన్న అభిప్రాయం.. ఇప్పటికే ప్రారంభమయింది. ఈ విషయం రేవంత్ తాను పార్టీ వాదినేనని.. సొంత ఇమేజ్ కోసం ప్రయత్నించడం లేదని చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీలో ఇతర నేతలు చేపట్టే పాదయాత్రలకు తాను హాజరవుతానంటున్నారు. రేవంత్ రాజకీయం ముందు సీనియర్లు కూడా… సైలెంటవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.