అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకబడిపోయిన గ్రేటర్ పరిధిలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి ప్లాన్డ్ గా ముందుకెళ్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని ఆయన పార్టీలో చేర్చుకోబోతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ లో రేవంత్ కు ప్రధాన ప్రత్యర్థి. అన్న నీడలోనే ఆయన రాజకీయం ఉంటుంది. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ఆయన చెప్పినప్పటికీ ఆన్న అభయం లేకపోతే ఆయన ఎలాంటి రాజకీయం చేయలేరని అందరికీ తెలుసు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ సాధిస్తే.. చేవేళ్ల పార్లమెంట్ విషయంలో ఆయన తన టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారని అనుకోవచ్చు.
నిజానికి చేవెళ్ల పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి నిలబడాలని రేవంత్ కోరుకునే మొదటి వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. రేవంత్ రెడ్డి ఆయనంటే గౌరవం ఇస్తారు. కానీ ఆయన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయనతో సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ లోకి రావాలన్నారు. కానీ పదే పదే పార్టీలు మారడం ఎందుకన్న ఉద్దేశమేమో కానీ ఆయన బీజేపీలోనే ఉన్నారు. నిన్నామొన్నటి వరకూ ఆయన వస్తే ఆయనకే టిక్కెట్ అన్న సంకేతాలు పంపారు. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తి చూపలేదు. దీంతో పట్నం మహేందర్ రెడ్డిని లైన్ లోకి తెచ్చారు రేవంత్ రెడ్డి.
పట్నం మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ప్రభావం చూపగల బలమైన నేత. ఆయన కు కావాల్సినంత ఆర్థిక శక్తి ఉంది. తాండూరులో బలమైన వర్గం ఉంది. గత ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డిని ఓడించడానికి ఆయన కాంగ్రెస్ కే పని చేశారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు ఆయననే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ లక్షన్నర ఓట్ల తేడాతో వెనుకబడి ఉంది. దీన్ని అధిగమించి లోక్ సభ సీటును గెలవడానికి రేవంత్ సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్లో వినిపిస్తోంది.