తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్సే ఇప్పుడు కీలకం కాబోతున్నారా అంటే.. అవుననే అనిపిస్తోంది ఈ ఘటన చోటుచేసుకున్న తరువాత. అధికార పార్టీ తెరాస నుంచి సీట్లు ఆశిస్తున్నవారు భారీ సంఖ్యలో ఉండటంతో వారిని ఇతర పార్టీలవైపు చూడకుండా, నయాన్నో భయాన్నో వారిని కట్టడి చేసేందుకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. బుజ్జగింపులకు లొంగకపోతే వేటు తప్పదని హెచ్చరించారు కూడా. అయితే, ఆ హెచ్చరికలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని స్పష్టమౌతోంది. అంతేకాదు, అసంత్రుప్తులను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కాచుకుని కూర్చుందా అన్నట్టు వ్యవహరించింది. రంగారెడ్డి జిల్లాలో ఒక తెరాస అసంత్రుప్త నేత ఇంటికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హుటాహుటిన వెళ్లి, స్వయంగా బీ ఫామ్ ఇవ్వడం విశేషం.
రంగారెడ్డి జిల్లా ఫిర్జాదీగూడలో దయాకర్ రెడ్డికి తెరాస నాయకుడికి మేయర్ టిక్కెట్ కేటాయించలేకపోయింది. భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని నేతలు కేసీఆర్ మాటగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన విన్లేదు. దీంతో వెంటనే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగేశారు. వెంటనే ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని, బీ ఫామ్ కూడా ఇచ్చేశారు. ఆ తరువాత, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో మేయర్ టిక్కెట్ కి రూ. 5 కోట్లు, ఛైర్మన్ పదవికి రూ. 3 కోట్లు, కౌన్సిలర్ టిక్కెట్ కి రూ. 25 లక్షలు, కార్పొరేటర్ కి రూ. 50 లక్షలు.. ఇలా ధరలు నిర్ణయించి సంతలో పసువుల్ని అమ్మి నట్టుగా తెరాస అమ్మకాలకి దిగుతోందని విమర్శించారు. తెరాసలో ముసలం పుట్టిందనీ, ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ హైడ్రామా ఇక్కడితో ఆగలేదు. రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లాక… దయాకర్ రెడ్డి ఇంటికి మంత్రి మల్లారెడ్డి హుటాహుటిన వెళ్లారు. అసంత్రుప్త తెరాస నేతను వెంటనే తన కారు ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి. తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ స్థాయిలో పొలిటికల్ గేమ్ ప్రారంభమైంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో కోణం.. అసంత్రుప్తులను ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించినా, బుజ్జగించినా, భవిష్యత్తు మీద స్వయంగా భరోసా ఇచ్చినా జంపింగులు ఆగేట్టు లేవు. ఒకటైతే వాస్తవం… ఈ ఫిరాయింపు రాజకీయాలు ఎక్కువైన కొద్దీ, ఏ పార్టీలోనైనా రాజకీయ భవిష్యత్తు అనేమాటకు అర్థం లేకపోయింది. ఇప్పుడు, ఈ క్షణం పదవి దక్కించుకోవడమే పరమావధి అన్నట్టుగా మారిపోయింది. ఎమ్మెల్యేల స్థాయిలో ఇదే జరుగుతూ ఉంటే, కిందిస్థాయిలో వద్దని ఆదేశిస్తే ఎవరు ఆగుతారు?