పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రాను ఎలా ఒప్పించారో కానీ రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ చైర్మన్ గా ఉండేందుకు అంగీకరింప చేశారు. చాలా వ్యాపకాలతో తీరిక లేకుండా ఉండే ఆనంద్ మహింద్రా తెలంగాణ యువతలో స్కిల్స్ పెంచేందుకు తన వంతు సహకారం , సమయం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అయితే రేవంత్ రెడ్డి మరో బాధ్యతను ఆయనపై పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి రేవంత్ ఆలోచన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ.
ఆనంద్ మహింద్రా తాజాగా ఒలింపిక్స్లో భారత ప్రదర్శనపై ఓ పోస్టు పెట్టారు. ఆటల్లో ప్రతిభాన్వేషణ జరగాల్సి ఉందని ఆయన పోస్టు సారాంశం. వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. మూడు గంటల్లోనే సుదీర్గమైన పోస్టు పెట్టారు. తాను ప్రైవేటుగా దీనిపై చర్చించాలనుకున్నా సందర్భం వచ్చింది కాబట్టి పబ్లిక్ గానే చెబుతున్నానని.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ గురించి చెప్పుకొచ్చారు. తనకు ఆలోచన వచ్చింది.. కొరియా పర్యటన సమయంలో అక్కడ స్పోర్ట్స్ యూనివర్శిటీని సంప్రదించానన్నారు. అక్కడ ఒలింపిక్ పతకాలు సాధించిన వారినీ సత్కరించానని తెలిపారు.
ఇప్పటికే హకీంపేట వద్ద రెండు వందల ఎకరాలు గత మూడు రోజుల్లోనే సిద్ధంగా ఉంచామని.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి కలసి పని చేద్దామని పిలుపునిచ్చారు. లాస్ ఎంజెల్స్ ఒలింపిక్స్ కు భారత్ తరపున మంచి ఆటగాళ్లను సిద్ధం చేస్తామని.. ఒలిపింక్ స్థాయి ఇన్ ఫ్రాను డెవలప్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ పిలుపుపై ఆనంద్ మహింద్రా స్పందన ఎలా ఉంటుందో కానీ.. రేవంత్ తపన మాత్రం.. అందర్నీ ఆకట్టుకుంటోంది.