రైతు రుణమాఫీ సరే.. రైతు భరోసా సంగేతింటి..?రుణమాఫీ ద్వారా రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా ఇంకా పంట పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తారని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని , ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వ అధికారులు తయారు చేస్తున్నారని, ప్రణాళిక సిద్దం కాగానే రైతు భరోసా అందిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. త్వరలోనే రైతులకు ఆర్థిక సాయం అందించి తీరుతామన్నారు.
ప్రస్తుతం రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాబోతోంది. అనంతరం రైతు భరోసా ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.ఇన్నాళ్లు బీఆర్ఎస్ కు ప్రధానమైన ఓటు బ్యాంక్ గా ఉన్న రైతాంగం.. రెండు లక్షల రుణమాఫీతో కాంగ్రెస్ వైపు టర్న్ అవుతోంది. ఇప్పుడు రైతు భరోసా కూడా పూర్తి చేస్తే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పూర్తిగా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతుందన్న ఆలోచనతో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ ప్రిపేర్ అవుతోంది. ఆలోపే రైతు భరోసాపై విధివిధానాలు ఖరారు అయితే, రైతుల ఖాతాలో నగదు జమ చేసి ఎన్నికలకు వెళ్తే ఇక కాంగ్రెస్ కు తిరుగు ఉండదని, బీఆర్ఎస్ ను పునాదుల నుంచి పెకిలించినట్లు అవుతుందన్న ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల అసంతృప్తిని కూడా తగ్గించారు..మహిళల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం పట్ల సానుకూలత ఉంది..ప్రధాన ఓటు బ్యాంకుగా ఉండే యువత, మహిళలు, రైతులను కాంగ్రెస్ వైపు మళ్ళించుకోవడంలో రేవంత్ సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నారు.