తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తోంది. యువ ముఖ్యమంత్రి తాను తెలంగాణను ఎలా తీర్చిదిద్దాలనుకున్నారో అలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారు. కాకపోతే ఆ ప్రయత్నాలకు సరైన కసరత్తు లేకుండా పోవడం వల్ల వివాదాల పాలయ్యారు. హైడ్రోకు మొదట్లోకు వచ్చిన హైప్ ఎంత… ఇప్పుడు ఉన్న వ్యతిరేకత ఎంటో అంచనా వేస్తే..వ్యూహాత్మక తప్పిదం చేసినట్లుగా స్పష్టమైపోతుంది. అలాగే మూసీ విషయంలోనూ.
ప్రభుత్వం ఏ పని చేపట్టాలన్నా దాని వల్ల నష్టపోయే ప్రజలు ఉంటారు. విస్తృత ప్రయోజనాల కోసం ఆ నష్టాన్ని కొంత మంది భరించాల్సిందే. అయితే ప్రభుత్వాల పని ఆ నష్టాన్ని కూడా భర్తీ చేయడం. ఓ పని చేసే ముందు మీకు నష్టం జరగదని మీరు చేసే త్యాగం వల్ల అంతా బాగుపడతామని ఒప్పించాలి. మూసి విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ అలా చేసే ప్రయత్నం చేయకుండా దూకుడుగా వెళ్లడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏడాది పాలన నుంచి రివ్యూ చేసుకుంటే ఆయనకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ప్రారంభించిన వైనం బాగానే ఉంది కానీ వెంటనే డిఫెన్స్ లోకి వెళ్లాల్సి వచ్చింది. మెల్లగా క్రీజులో కుదురుకున్న తర్వాత సిక్సులు కొట్టవచ్చు. పదవిలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పని అది.కానీ రేవంత్ హిట్టింగ్ చేసే ప్రయత్నం చేసి.. ఎదురుదెబ్బలు తిన్నారు.
ఓ వైపు ప్రభుత్వంపై పదే పదే వ్యతిరేక ప్రచారం చేసి.. ఏదో జరిగిపోతుందన్న అభిప్రాయం కల్పించడానికి విపక్షాలు చాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో రేవంత్ దూకుడు తగ్గిస్తారా లేదా అన్నది కాదు అన్ని పరిస్థితుల్ని సమర్థంగా డీల్ చేసేలా వ్యవస్థల్ని అప్రమత్తంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.