తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్‌ను నియమించారు. పేరు చూస్తే దక్షిణాదికి చెందిన నేతలా కనిపిస్తారు కానీ ఈమె మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగి అక్కడే రాజకీయం చేశారు. ఓ సారి ఎంపీగా గెలిచారు. రెండు సార్లు ఓడిపోయారు. అయితే రాహుల్ గాంధీని బాగా ఆకర్షించిన లీడర్ ఈమె. అందుకే ఏఐసీసీలో కీలక పాత్రల్లోఉంటారు. ఇప్పుడు దీపాదాస్ మున్షిని తప్పించి మీనాక్షికి అవకాశం కల్పించారు.
మున్షిపై కాంగ్రెస్ నేతల అసంతృప్తి
దీపాదాస్ మున్షి కాంగ్రెస్ విజయం కోసం పని చేయలేదు. విజయం సాధించే వరకూ మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావుథాక్రే ఇంచార్జ్ గా ఉండేవారు. గెలవగానే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టి బెంగాల్ కు చెందిన మున్షీని ఇంచార్జ్ గా పెట్టారు. ఆమె హైదరాబాద్ ఓ. బంగళా అద్దెకు తీసుకుని సమాంతరం ప్రభుత్వం నడిపారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవులు భర్తీ చేయలేకపోవడానికి.. మంత్రి వర్గ విస్తరణకు కూడా అడ్డుపడ్డారని.. హైకమాండ్ కు ఎప్పటికప్పుడు తన జాబితా పంపి.. అసలు జాబితాలకు అడ్డుపడేవారని అంటారు. కారణం ఏదైనా హైకమాండ్ ఆమెను తప్పించింది.
మీనాక్షి నటరాజన్ ను నియమించడం వెనుక రాహుల్
తెలంగాణ కాంగ్రెస్ కు కీలక రాష్ట్రం. ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఒకటి. అయితే రేవంత్ రెడ్డి కృషితోనే అది సాధ్యం అయింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ రేసులో కూడా లేని కాంగ్రెస్ ముందుకు రావడానికి రేవంత్ రెడ్డి కృషే కారణం.అయితే ఎందుకో కానీ ఆయనను నియంత్రించడానికే హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఏ పనికీ అనుమతి ఇవ్వడం లేదు. ఢిల్లీ పెద్దల ద్వారా ఆడించే ప్రయత్నం చేసింది.తాజాకా మీనాక్షి నటరాజన్ నియామకం వెనుక రాహుల్ పాత్ర ఉందని చెబుతున్నారు. రేవంత్ పాలనపై ప్రత్యక్ష పరిశీలనకు మీనాక్షిని నియమించారని భావిస్తున్నారు.
పార్టీ కోసమే ఇంచార్జ్ వ్యవస్థ -పాలనలో జోక్యం చేసుకుంటే కష్టమే
కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అంటే కాంగ్రెస్ పార్టీకే పరిమితం. పార్టీలో అసంతృప్తులు ఉంటే బుజ్జగించడం.. పార్టీ బలోపేతానికి పని చేయడం చేసుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇంచార్జులుగా వచ్చేవారు సమాంతర పాలన చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడే సమస్యలు వస్తాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎలా వ్యవహరిస్తారో.. పైగా తాను రాహుల్ టీం అనే భావన ఆమె లో కాస్త ఎక్కువగానే ఉంటుందని చెబుతారు.