సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి .. పాలనలో బీఆర్ఎస్ ప్రభావం లేకండా జాగ్ర్తత పడుతున్నారు. ఎంత లేదన్నా పదేళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ప్రతి వ్యవస్థలోనూ అధికార పార్టీకి చెందిన వారు పై స్థాయిలో పాతుకుపోయి ఉన్నారు. ఇప్పుడు వారందర్నీ మార్చేసి… బీఆర్ఎస్ ముద్ర లేకుండా చేయాలనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పలు కార్పోరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పోరేషన్ల చైర్మన్ల నియామకాలు రద్ధు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆరెస్ ప్రభుత్వ హాయంలో నియమించబడిన చైర్మన్ల నియామకాలు దీంతో రద్దయ్యాయి. వారిలో కొంమంది ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. కాగా ఇప్పటికే గత ప్రభుత్వం నియమించిన 12మంది సలహాదారుల నియామకాలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా కార్పోరేషన్ల చైర్మన్ల నియామకాలను కూడా రద్దు చేసింది.
అధికార పార్టీ నేతల సిఫారసుల మేరకు నియమితులైన అధికారులకు స్థానం చలనం కలుగుతోంది. డిప్యూటేషన్ మీద ఇతర శాఖల్లో ఉన్న వారిని సొంత శాఖలకు పంపేస్తున్నారు. ప్రత్యేక ఆదేశాల మీద నియమితులైతే వెంటనే పదవుల నుంచి తీసేస్తున్నారు. పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన కూడా ప్రారంభమయింది. భారీగా బదిలీలు జరగనున్నాయి.
రేవంత్ రెడ్డి… తనదైన ముద్ర వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముందు ముందు పాలనలో ప్రత్యేకత చూపించే అవకాశం కనిపిస్తోంది.