కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ వీడియోలను . ఏఐ వీడియోలను, ఫోటోలను విస్తృతంగా ఉపయోగించి చేయాల్సినంత డ్యామేజ్ చేశారని చాలా మందిపై రేవంత్ ప్రభుత్వానికి కోపం ఉంది. వారందరిపై నేరుగా కేసులు పెట్టి అరెస్టు చేయడం అంటే.. అదో వివాదాస్పదం అవుతుంది. కానీ చర్యలు తీసుకోకుండా ఉంటే.. అది ఎక్కువైపోతుంది. అందుకే బాగా ఆలోచించి ఓ కీలకమైన అడుగు వేశారు. నేరుగా చర్యలు తీసుకునేలా కోర్టు నుంచే ఆర్డర్స్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కంచ గచ్చిబౌలి విషయంలో వన్య ప్రాణులు చెల్లా చెదురు అవుతున్నట్లుగా ఫేక్ వీడియోలు.. ఏఐ వీడియోలు క్రియేట్ చేశారని.. తప్పుడు ప్రచారం చేసి సమాజంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు కారణమయ్యారని అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు 24వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున వాదనలు వింటామని చెప్పింది.
తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు కూడా చెప్పలేదు. ఏఐ వీడియోలు ప్రచారం చేశారని నిరూపించేందుకు సాంకేతిక అంశాలను ప్రభుత్వం సిద్దం చేసుకుంది. ఎప్పుడు హైకోర్టు అనుమతి ఇచ్చినా తర్వాత వరుసగా అరెస్టులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంత మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. కొంత మందికి నోటీసులు ఇస్తున్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే.. ఒకే సారి విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి.