తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జాీర చేసింది. గ్రామాల్లో సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ కమిటీ చైర్మన్ గా మహిళా సంఘాల నుండి ఇద్దరు మహిళా సభ్యులు, గ్రామంలోని ముగ్గురు బీసీ,ఎస్సి,ఎస్టిల నుంచి సభ్యులు, పంచాయతీ సెక్రటరీ కమిటీ కన్వీనర్ గా ఈ ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పంచాయతీల కాలపరిమితి ముగిసింది కాబట్టి ఇప్పటికిప్పుడు స్పెషలాఫీసర్ల ఆధ్వర్యంలో ఏర్పాటవుతాయి. పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ చైర్మన్ గా ఇద్దరు మహిళా సంఘాల సభ్యులు, ముగ్గురు ఎస్సి,ఎస్టీ,బీసీ సభ్యులుగా ఉంటారు.
ప్రభుత్వ పాలన క్షేత్ర స్థాయికి ఈ కమిటీల ద్వారానే వెళ్తుంది. అంటే పథకాల లబ్దిదారులను ఈ కమిటీలే ఫైనల్ చేస్తాయి. త్వరలో 4 లక్షల 50వేలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్కో ఇంటికి 5లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందించనుంది.. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై అవగాహన, సోషల్ ఆడిట్, అధికారులతో సంప్రదింపులు లాంటి కార్యక్రమాలను ఇందిరమ్మ కమిటీలే చూసుకుంటాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లను ఎంపిడిఓ,మున్సిపల్ కమిషనర్ లు నామినేట్ చేస్తూ కలెక్టర్ కు సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
జీవోలో చెప్పకపోయినా సహజంగానే అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉంటారు. వచ్చే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ఈ ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా అనుకోవచ్చు. ప్రతి పథకానికి ఇందిరమ్మకమిటీలు కీలం కాబట్టి… ఓటర్లు కూడా ఈ కమిటీల గుప్పిట్లోనే ఉంటారని..అదే పార్టీకి కూడా మేలు చేస్తుందని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రతి పథకం కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదుగానే అమలవుతుందని ప్రకటించారు. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.కానీ అధికారిక ఉత్తర్వులు వచ్చే సరికి పది నెలలు అయింది.