కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లుగానే న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ భూములు అమ్ముకుంటారా లేదా అన్నదానిపై తాము విచారణ జరపడం లేదని చెట్లు కొట్టి వేయడంపైనే తాము విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. చెట్లు కొట్టివేయడంపై గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా లేదా అని ప్రశ్నించింది. అలాగే చెట్ల కొట్టివేతకు పర్యావరణ శాఖ అనుతులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకపోతే మాత్రం చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరించింది. తదుపరి విచారణను మరో నెలకు వాయిదా వేసింది.
కొట్టేసిన చెట్లను పెంచడం, వన్యప్రాణుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన కార్యాచరణతో అఫిడవిట్ దాఖలు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. చెట్ల కొట్టివేతపై తదుపరి విచారణ వరకూ స్టేటస్ కో కొనసాగించారు. చెట్లు కొట్టవద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నించడం కంటే పునరుద్ధరణ ప్రణాళికను చేస్తే ప్రయోజనం చేకూరుతుందని ధర్మాసనం నొక్కి చెప్పింది. సరైన, ఆమోదయోగ్యమైన ప్రణాళికను సమర్పించడంలో విఫలమైతే కొంతమంది అధికారులు తాత్కాలికంగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.
కంచ గచ్చిబౌలి భూములను రూ.10 వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని కేంద్ర సాధికార కమిటీ నివేదికలో చెప్పినట్లు అమికస్ క్యూరీ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ భూములను ప్రభుత్వం అమ్ముతుందా, మార్టిగేజ్ చేస్తున్నారా అనేది తమకు అనవసరమని ధర్మాసనం చెప్పింది. ఆ వందల ఎకరాలలో చెట్లు కొట్టివేయడానికి ముందు పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది అసలు విషయమని బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఈ ప్రకారం చూస్తే.. సమగ్రమైన ప్రణాళికతో వెళ్తే రేవంత్ సర్కార్ కు వచ్చే విచారణలో ఊరట లభించే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.