తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మంగళవారం 10 టీవీకి వచ్చారు. పసునూరి శ్రీధర్ తనను ఇంటర్వ్యూ చేశారు. నేను బయిటకు వెళ్లబోతుండగా పెద్ద కారు చూసి ఎవరొచ్చారని అడిగితే రేవంత్ వున్నారని తెలిసింది. చాలా రోజులైందని వెళ్లి కలసి మాట్లాడాను. ఇతర విషయాలు పక్కనపెడితే తెలుగు360లో ఈ మధ్య నేను రాసిన ఒక ఐటం ప్రస్తావనకు వచ్చింది. కలం పట్టిన వెంకయ్య, రేవంత్ పొన్నాల అని రాసిన దాంట్లో విషయమే తను కూడా ప్రస్తావించారు. ఏమంటే మీడియాను పిలిచిమాట్లాడినా సరే తాము చెప్పిన అన్ని అంశాలు వచ్చే అవకాశం వుండదని, కనీసం ముఖ్యమైనవి కూడా కొన్నిసార్లు సరిగ్గా రిఫ్లెక్ట్ కావడం లేదని రేవంత్ చెప్పారు. అందుకే తాను వ్యాసాలు రాయడం మొదలుపెట్టానని వివరించారు. అప్పుడే నేను 360లో దీనిపై ఐటం రాసిన సంగతి చెప్పాను. నా మొబైల్లో తన ఫోటోతో సహా వున్న ఆ ఐటం చూపిస్తే మొత్తం చదివి సంతోషించారు. తెలంగాణలో తెలుగుదేశం భవిష్యత్తుకోసం దీర్ఘకాలిక దృష్టితో కృషి చేస్తామని, విమర్శలకే పరిమితం కాకుండా ప్రజాసమస్యలపైనా పనిచేయడం కోసమే మల్లన్నసాగర్‌పై నిరాహారదీక్ష చేశానని రేవంత్ తెలిపారు.