మూసి నది ప్రక్షాళన విషయంలో అక్కడ ఆక్రమణలు చేసిన వారిని రెచ్చగొట్టి పనులు అడ్డుకుంటున్న వారిపై రేవంత్ రెడ్డి నల్లగొండ అస్త్రం వదిలారు. మూసీ విషాన్ని నల్లగొండ ప్రజలు తాగాల్సిందేనా అని ప్రశ్నించారు. ఒక్క సీటు కూడా ఇవ్వలేదని వారిని చంపే ప్రయత్నం చేస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలతో ముందుగా ఈటల ఉలిక్కి పడ్డారు. తాము మూసీ నదిని ప్రక్షాళన చేయవద్దని చెప్పడం లేదని నిర్వాసితులకు న్యాయం చేయాలని అంటున్నామన్నారు. నల్లగొండ ప్రజలు రేవంత్ మాటల్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
మూసీ నది నల్లగొండలో కీలక నదిగా ఉంది. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో మూసి పొంగుతుంది. చాలా సార్లు నల్లగొండలో మూసి నది ఉద్ధృత ప్రవాహం ఉంటుంది. పలు చోట్ల తాగు, నాగునీటి పథకాలు ఈ నదిపై ఉన్నాయి. అందుకే కోమటిరెడ్డి ఒక రోజు ముందు మూసీ నదీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారని.. నల్లగొండ ప్రజలు రాళ్లతో కొడతారని బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు దానికి కొనసాగింపుగా రేవంత్ మరింత సెంటిమెంట్ ప్రకటన చేశారు.
ఇప్పుడు మూసి సుందరీకరణ పనుల్ని అడ్డుకుంటే.. నల్లగొండలో అంత కంటే ఎక్కువగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇక నుంచి బీజేపీ ఆయినా బీఆర్ఎస్ అయినా ఈ విషయంలో కాస్తంత ఆలోచించి ఉద్యమం చేయాల్సి ఉంటుంది. నల్లగొండలో పట్టు కోల్పోతే.. సీట్లపై ఆశలు వదులుకుంటే.. అధికారం కల్లగా మారుతుంది.