తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం నిరాహారదీక్ష చేపట్టడం మంచిదే. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి చట్టాల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా చేయొచ్చు. కాని మాటిమాటికి ఆంధ్ర నేతలతో కుమ్మక్కు గురించి ఆరోపణలు చేయడంలో ఔచిత్యం ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజయవాడలో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకునేవారు రెండు రాష్ట్రాల సుహృద్భావ సంబంధాలను గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు తరచూ నాకు రెండు రాష్ట్రాలు ఒకటేనని చెబుతుంటారు. ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన మిగిలిన వారిలో అతిముఖ్యుడైన మిత్రుడు రేవంత్‌కు ఈ సూత్రం వర్తించదా? జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలోనూ కెటిఆర్ హైదరాబాద్‌లో వున్నవారంతా మావారేనన్నట్టు మాట్లాడితే రేవంత్ తప్పు పట్టారు. టిఆర్ఎస్ నాయకుల వ్యవహార సరళిలో చేతల్లో తప్పువుంటే ఖండించవచ్చు గాని ప్రాథమికంగా స్నేహ భావన సరైందే కదా. ఆ సమయంలోనే నేను ఒకటి రెండు సార్లు రేవంత్ వాదనలోని వైరుధ్యాన్ని ప్రస్తావిస్తే కాస్త వాదన కూడా జరిగింది. టిఆర్ఎస్ వారు చేసిన వాదనల వంటివి కొన్నిసార్లు అంతకంటే తీవ్రంగా కూడా ఆయన చేశారు. మల్లన్నసాగర్ బాధితుల సమస్యకూ ఆంధ్ర తెలంగాణ వాదనలకూ సంబంధం ఏమిటో తెలియదు.
మాజీ మంత్రి టిడిపి నుంచి బిజెపిలో చేరిన నాగం జనార్థనరెడ్డి కూడా మొన్న ఒక చర్చలో ఇలాగే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పాలన కాలంలో పనులు గొప్పగా జరిగాయని తాము ప్రతిదీ పర్యవేక్షించి నిధులు మంజూరు చేసేవారమని చెప్పారు. ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకూ దీనికి పొంతన లేదు. ఇకపోతే అదే నాయకుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్ర కాంట్రాక్టర్లకే అన్నీ కట్టబెడుతున్నదని విమర్శించారు. సరిహద్దులు మారిన పాలకుల బుద్ధులు పద్దతులు పెద్దగా మారింది లేదని నేను చాలా సార్లు వ్యాఖ్యానించాను. రెండు రాష్ట్రాల పారిశ్రామిక వేత్తల కాంట్రాక్టర్ల జాబితాలో వారే వుంటారు. చక్రం తిప్పుతుంటారు. ఆ మాటకొస్తే బిజెపి పాలించే తొమ్మిది రాష్ట్రాల్లోనూ ఆ కాంట్రాక్టరే అంతా నడిపిస్తున్నారని టిఆర్ఎస్ ఎంఎల్‌సి ఒకరు సవాలు చేశారు. కాబట్టి నిజమైన సమస్యలు వదలిపెట్టి వ్యర్థ వివాదాలతో వేడిపెంచాలనుకోవడం వృథా ప్రయాస. ఎవరెంత ప్రేరేపించినా పరస్పర ఘర్షణనూ వివాదాన్ని ఎపి తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదు. ముఖ్యమంత్రులూ వద్దంటున్నారు. విభజన తర్వాత ప్రాజెక్టులపైనో పంపిణీలపైనో వివాదాలు వుండొచ్చు గాని వాటిని ప్రభుత్వాల పరంగా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాంతీయత అంటగట్టిన విమర్శలు కనీసం రేవంత్‌రెడ్డి వంటి ‘జాతీయ’ పార్టీ నేతలకు తగవు .మిగిలిన వారంతా మల్లన్నసాగర్ ఆందోళనలో పాల్గొన్నప్పుడు రాని ప్రస్తావనలు తీసుకురావడం ఆయన పార్టీని, అధినేతలను కూడా ఇరుకునపెట్టడానికి తప్ప రాజకీయ పురోగమనానికి దోహదం చేయదు.