తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే చిన్న నిర్ణయాలను కూడా పెద్ద బూతద్దంలో చూపించి వివాదాస్పదం చేయడానికి విపక్ష పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. సక్సెస్ అవుతున్నాయి. యూట్యూబర్ల అరెస్టు నుంచి భూముల అమ్మకం వరకూ ఎన్నో అంశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆన్ లైన్లో ప్రారంభించి.. ఆఫ్ లైన్ వరకూ విస్తరిస్తున్నారు. అంతా ప్లాన్డ్ గా జరుగుతున్నా అడ్డుకోవడంలో మాత్రం రేవంత్ విఫలమవుతున్నారు. ఆ సమస్య అంతకంతకూ పెరిగిపెద్దదవుతోంది. పరిష్కరించడంలో విఫలం అవడం కన్నా.. అసలు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి వివాదాలు పెద్దవి అవుతున్నాయని అనుకోవచ్చు.
గతంలో ఎప్పుడూ భూములు అమ్మలేదా ?
కేసీఆర్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో కొన్ని వందల ఎకరాలను అమ్మింది. వేలం వేసి కోకాపేటలో ఎకరం వంద కోట్లకు అమ్మినప్పుడు అందరూ ఆహా..ఓహో అన్నారు. బుద్వేల్ నుంచి మోకిలా వరకూ లే ఔట్లు వేసి లెక్కలేనన్ని ఎకరాలు అమ్మేశారు. అయితే ఎప్పుడూ ఆయా భూముల్లో చెట్లు ఉన్నాయని .. జింకలు, నెమళ్లు తిరుగుతున్నాయని అనలేదు. రియల్ భూమ్ ను కేసీఆర్ భలే పెంచారే అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయవివాదంలో ఉన్న భూములకు పరిష్కారం లభించి వాటిని అమ్ముదామనుకుంటే మాత్రం అవి హెచ్సీయూ భూములని.. పర్యావరణ పరిరక్షణ అని ఉద్యమం ప్రారంభించారు. కానీ రేవంత్ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఇది ఏకు మేకయ్యే పరిస్థితి వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో యూట్యూబర్ల అరెస్టులే జరగలేదా ?
రేవంత్ రెడ్డిని చంపుతానని ఓ వ్యక్తితో చెప్పించడమే కాదు సీఎం కుటుంబాన్ని అత్యంత ఘోరంగా తిట్టించడంతో ఇద్దరు యూట్యూబర్లను పోలీసులు అరెస్టు చేశారు. దానికే చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అరెస్టు అయిన యూట్యూబర్లలో ఒకర్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనూ అరెస్టు చేశారు. ప్రధాన మీడియాను నెలల తరబడి బ్యాన్ చేశారు. యూట్యూబర్ కూడా అయిన తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లపై జరిగిన దాడుల గురించి చెప్పాల్సిన పని లేదు. మద్దతుగా ప్రచారం చేస్తే సరి లేకపోతే మనుగడ సాగించలేరన్న భావన కల్పించారు. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ చేసిన రెండు అరెస్టులు.. అది కూడా వారి మాటల్ని ఎవరూ సమర్థించని కేసులో చేస్తే రచ్చ చేశారు. రేవంత్ ప్రభుత్వం ఏదో నేరం చేసిందని నిరూపించే ప్రయత్నం చేశారు. దీన్ని తిప్పికొట్టడంలో ఎంత మేర సక్సెస్ అయ్యారో కాంగ్రెస్ నేతలే ఆలోచించుకోవాలి.
రేవంత్ రాజకీయం కూడా చేయాల్సిన అవసరం
రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయమే చేసేవారు. ఇప్పుడు ఆయనపై పాలనాభారం ఉంది. అందుకే రాజకీయాలపై ఆయన దృష్టి పెట్టలేకపోతున్నారు. రాజకీయం చేస్తే.. ఇతరులకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంటుంది. ప్రభుత్వం తరపున డిఫెన్సివ్ గా స్పందిస్తే దాడులు అంతకంతకూ పెరుగుతాయి. ఇప్పుడదే జరుగుతోంది. రేవంత్ రెడ్డి పాలనతో పాటు రాజకీయం కూడా చేయాలన్న అభిప్రాయం ఏర్పడుతోంది.