జగన్ 3 రాజధానుల నిర్ణయం ప్రకటించిన నాటి నుండి ఏపీలో అనిశ్ఛితి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ రియల్ ఎస్టేట్ టైకూన్ మై హోమ్ రామేశ్వర రావు కు మేలు చేసేందుకే ఏపీలో అనిశ్ఛితి సృష్టించారా? కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇవే సందేహాలు కలుగుతున్నాయి.
ఏపీ లో నెలకొన్న తాజా పరిస్థితులపై స్పందిస్తూ, ఒక తెలంగాణ వ్యక్తి గా ఏపీ లోని పరిస్థితి కారణంగా తెలంగాణా లాభపడటం తనకు సంతోషమే అయినా, ఒక భారతీయుడి గా బాధ పడుతున్నానని, నిన్నటి దాకా సోదరులు గా ఉన్న రాష్ట్రంలో ముసలం పట్టడం బాధగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి లాభం చేకూర్చడానికే ఆంధ్రప్రదేశ్లో అనిశ్చితి సృష్టించే పరిణామాలు జరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ రెడ్డి నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు చూసిన వారికి ఆయన మాట్లాడుతోంది, కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడు అయినటువంటి మై హోమ్ రామేశ్వర రావు గురించే అన్న అభిప్రాయం కలుగుతోంది.
ఎన్నికల తర్వాత నుండి కేసీఆర్ జగన్ ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే ఇవి రాజకీయపరంగా ఉండాల్సిన సత్సంబంధాలను మించి కొనసాగుతూ ఉండటం తెలిసిందే. జగన్ కేసీఆర్ నివాసానికి వచ్చిన సందర్భంలో విజయసాయిరెడ్డి మీడియా కెమెరాల ముందే కేసీఆర్ కాళ్లు మొక్కి నమస్కారం చేయడం తెలిసిందే. అదే విధంగా పలు విషయాల లో, కెసిఆర్ నిర్ణయాలు ఆంధ్ర ప్రదేశ్ కి నష్టం కలిగిస్తు న్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వాటిమీద పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. వీటన్నిటికి మించి మొన్నీ మధ్య ఒక రియల్ ఎస్టేట్ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని అనిశ్చితి పరిస్థితులు తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చాయి అన్న అర్థం వచ్చేలా నవ్విన ఒక వెటకారపు నవ్వు ప్రజలకు ఇంకా గుర్తుంది. మొత్తానికి ఈ లింకులన్నీ కలుపుకుంటూ పోతే, మై హోమ్ రామేశ్వర రావు కు లాభం చేకూర్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని ఒప్పుకోక తప్పదు