తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ సభకు ముందు రోజు గడ్డు పరిస్థితిలో చిక్కుకున్నారు. ఆయన ఎంపీ శశిథరూర్‌ను గాడిద అని తిట్టిన వ్యవహారం రచ్చ అయింది. కాంగ్రెస్ హైకమాండ్‌కు సన్నిహితులైన వారు కూడా రేవంత్ తీరును ఖండించారు. కానీ ఇది జరిగిన మూడు రోజులకే .. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి అనూహ్యంగా పెరిగింది.దీనికి కారణం గజ్వేల్‌లో నిర్వహించిన సభగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆకట్టుకుంది.
హైకమాండ్ ముఖ్యుల్లో ఒకరైన మల్లిఖార్జున ఖర్గేను ప్రత్యేకంగా ఆహ్వానించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి .. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ ఉందనే గట్టి నమ్మకాన్ని రేవంత్ రెడ్డి కల్పించారు. దీంతో శశిథరూర్‌ను దూషించిన అంశం పక్కకుపోయింది. ఆ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముగించారు. ఏ మాత్రం భేషజానికి పోకుండా శశిథరూర్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు. మనీష్ తివారీ లాంటి నేతల బహిరంగ స్పందనతో రేవంత్ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. రేవంత్ ఆలస్యం చేసినట్లయితే ఆ ప్రభావం .. గజ్వేల్ సభపై పడి ఉండేది. కానీ అందరి దృష్టికి వెళ్ల ముందే ఆ వివాదాన్ని ముగించి గజ్వేల్ సభపై దృష్టి పెట్టారు. తెలంగాణలో అదే రోజు అమిత్ షా పర్యటించారు. ఆయన పర్యటన చాలా ప్రైవేటుగా సాగినట్లుగా సాగిపోయింది.
రెండు సభలపై సహజంగానే పోలికలు చూస్తారు . మీడియాలో మాత్రమే అమిత్ షా సభ కనిపించింది. ప్రజల్లో స్పందన లేదు. కానీ రేవంత్ సభ వేరు. ఇది హైకమాండ్‌ను ఆకర్షించింది. అందుకే రేవంత్ రెడ్డి పలుకుబడి హైకమాండ్ వద్ద మరింత పెరిగిందని అంటున్నారు. గజ్వేల్ సభపై పూర్తి వివరాలు తెప్పించుకున్న హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి హాజరు కాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకునే చాన్స్ ఉందని కాంగ్రెస్‌లోనే ప్రచారం జరుగుతోంది.