తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు విచిత్రంగా సాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన ఉన్నప్పుడు పెద్దగా కదలకుండా.. మెదలకుండా ఉండే వర్గం ఇప్పుడు ఒక్క సారిగా యాక్టివ్ అయింది. భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఆ వర్గం ప్రత్యేకంగా చింతనన్ శిబిరం నిర్వహిస్తోంది. కీసరలో రెండు రోజులపాటు నవ సంకల్ప శిబిర్ పేరుతో మేథో మధన సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది మొత్తం భ ట్టి విక్రమార్క డీల్ చేస్తున్నారు. అన్నీ తానే ముందుండి చూసుకుంటున్నారు.
ఈ సమావేశంలో రేవంత్ వ్యతిరేకవర్గంగా భావిస్తున్న వారంతా పాల్గొంటున్నారు. వారిదే కీలక పాత్రగా చెబుతున్నారు. మొత్తంగా ఆరు కమిటీలు వేస్తే.. ఆరు కమిటీలకు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి,జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వీహెచ్ హనుమంతరావు లు నేతృత్వం వహిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపైన నవ సంకల్ప శిబిరంలో లోతుగా చర్చించి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటామని బట్టి విక్రమార్క చెబుతున్నారు. ఏంటీ రేవంత్ రెడ్డి లేకుండానేనా అని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది.
రేవంత్‌ను వ్యతిరేకించే మరో నేత ఏలేటి మహేశ్వరర్ రెడ్డి ఈ శిబిరం బాధ్యతలు తీసుకున్నారు. కారణం ఏదైనా రేవంత్ వ్యతిరేక వర్గ భేటీగా ఈ చింతన్ శిబిరం ప్రచారంలోకి వచ్చింది. ఇందులో రేవంత్ వర్గీయులు చొరబడి అలజడి రేపితే కాంగ్రెస్ పార్టీకి మరోసారి తనదైన రాజకీయాల్లోకి హెడ్ లైన్స్‌లోకి వస్తుంది. పీసీసీ చీఫ్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి శిబిరం నిర్వహిస్తే ఏమవుతుందని.. అంత తొందర ఎందుకని ఆయనకు మద్దతుగా ఉండేవారు ప్రశ్నిస్తున్నారు.