తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ రేవంత్ రెడ్డి ఆ పార్టీ అధినేత టచ్‌లోనే వున్నారట. కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా ఎప్పుడైనా సంప్రదించి సలహాలు తీసుకుంటున్నారట కూడా. ఇందుకు సంబంధించిన సమాచారం మరింత వివరంగా అందుబాటులో వున్నా బయిటపెట్టడం భావ్యం కాదు గనక ఇక్కడితే ఆపేస్తున్నాను. మిగిలిన తెలుగుదేశం నేతలు తప్ప చంద్రబాబు ఒక్కసారి కూడా రేవంత్ పేరు తీసి విమర్శించకపోవడం, ఆయన కూడా మాజీ అధినేతపై మర్యాద గుప్పించడం కేవలం యాదృచ్చికం కాదు.ఒక అవగాహన ప్రకారం జరుగుతున్నదేనని స్పష్టమవుతుంది. టిఆర్ఎస్లో తన పాత మిత్రులు చాలా మంది వున్నారు గనక కాంగ్రెస్‌లోనూ రేవంత్ వంటి బలమైన మిత్రుడు వుంటే మంచిదని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. పైగా కేసులూ వివాదాలూ కూడా వుండనే వున్నాయి. రేవంత్ రాజీనామా లేఖను చంద్రబాబుకు ఇవ్వలేదని టిటిడిపి అద్యక్షుడు ఎల్.రమణ వంటివారు అంటుంటే కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. సరైన నమూనాలోనే ఇచ్చారనీ అయితే తానే ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు లేఖను పంపే సమస్య వుండదని వారి వాదన. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన లేఖతో మాకేమీ సంబంధం అని టిడిపి వాదన. మొత్తానికి నేరుగా రాజీనామా చేసి ఎన్నికల బరిలో దూకేందుకు రేవంత్ కూడా సిద్ధంగా లేరన్నది నిజం. ఈలోగా టిఆర్ఎస్ నేతలు ఆయన వెనక వున్న ద్వితీయ శ్రేణి కార్యకర్తలను తరలించుకుపోవడంపై కేంద్రీకరించారు. ఈ దశలో ఆయన గెలవకపోతే మనకు దెబ్బ అని కాంగ్రెస్‌లో ఒక వర్గం వాదన మొదలెట్టింది. అలా అలా తటపటాయింపు పెరిగింది. మొత్తానికి చంద్రబాబు లేఖ పంపరు. రేవంత్ తనుగా రాజీనామా చేయరు, స్పీకర్ తొలగించరు. ఉత్తుత్తి సవాళ్ల సందడి సాగుతుంటుంది.దట్సాల్.