తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరోసారి తనంతటకు బయటకు రాలేనంత పద్మవ్యూహం ఏర్పాటు చేసుకుని అందులో ఇరుక్కుపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పద్మవ్యూహం పేరుతో బీసీ రిజర్వేషన్లు. కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.అందులో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడ షరతులు వర్తిస్తాయని చెబితే సమస్య ఉండేది కాదు. కానీ తాము చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు అది గుదిబండగా మారింది.
చట్టపరంగా రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదు !
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాలని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. అంటే ఈ అంశంపై ఆయనకు క్లారిటీ ఉన్నట్లే. మరి బీసీ డిక్లరేషన్ లో ఎలా పెట్టారు ?. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేసే రాజ్యాంగసవరణ చేసి ఇచ్చేవారమని కాంగ్రెస్ చెబుతుంది. మరి అదే విషయం షరతులు వర్తిస్తాయనే కేటగిరీ కింద బీసీ డిక్లరేషన్ లో పెట్టాల్సింది. కానీ పెట్టలేదు. ఇప్పుడు రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడం సాధ్యం కాదని సన్నాయి నొక్కులు నొక్కితే విపక్ష పార్టీలు ఊరుకుంటాయా?
కులగణనతో ఎన్నో సమస్యలు
బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు కులగణన చేశారు. డెడికేటెడ్ కమిషన్ వేశారు. అయితే ఇవేమీ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించవు. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాము అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపుతామని అంటున్నారు. ఈ మాత్రం తీర్మానాలు కేంద్రం వద్ద గుట్టలుగా పడి ఉన్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి రిజర్వేషన్ల పెంపు తీర్మానాలు కేంద్రం వద్ద ఉన్నాయి. ఏ రాష్ట్రం సంగతో ఎందుకు తెలంగాణ ప్రభుత్వ తీర్మానాలు కూడా ఉన్నాయి. వాటితో అయ్యేది, పొయ్యేది ఏదీ ఉండదు.
పద్మవ్యూహం నుంచి బయటపడగలిగితేనే ఎన్నికలు
బీసీ రిజర్వేషన్లను రాజకీయంగా ఇస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ ఊరుకునే అవకాశం లేదు. రచ్చ చేస్తాయి. ఇప్పుడు తీర్మానం చేసి కేంద్రానికి పంపించి.. వెంటే ఎన్నికలను పాత రిజర్వేషన్లతోనే నిర్వహిస్తే దానికి సరైన సమాధానం చెప్పుకోవడం కాంగ్రెస్ కు కష్టమవుతుంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముందుకెళ్లినా..యాభై శాతం పదవులు బీసీలకే ఇచ్చినా.. చట్టబద్ధమైన రిజర్వేషన్ల ముందు సమానం కాదు.