టి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. బంగారు తెలంగాణను బాకీల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో వైఫల్యం, దళితులకు ఇచ్చే మూడెకరాల భూముల్లో వైఫల్యం, రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ అమలు ఇలా అన్నింటా కేసీఆర్ విఫలమయ్యారన్నారు. కోటి ఎకరాలకు నీరిస్తామని రైతులకు కలలు చూపించి, కనీసం లక్ష ఎకరాలైనా కొత్త ఆయకట్టుకి నీరు ఇవ్వలేకపోయారన్నారు. ఓపక్క రాష్ట్రాన్ని దివాలా తీయించి, కేసీఆర్, కేటీఆర్, రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి తెలంగాణలో అత్యంత ధనవంతులయ్యారని విమర్శించారు.
ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఘాటు విమర్శలు రేవంత్ చేయడం ఓరకంగా వ్యూహాత్మకమే. కేసీఆర్ ని బలంగా ఎదుర్కొనగలిగే కాంగ్రెస్ నేత తానే అని మరోసారి హైకమాండ్ కి ఇచ్చే సంకేతంగా దీన్ని చూడొచ్చు. ఎందుకంటే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని ఆ మధ్య చాలా కథనాలొచ్చాయి. ఇదే సమయంలో రేవంత్ మీద పార్టీలో చాలామంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో రేవంత్ పేరును హైకమాండ్ అంత ఈజీగా ఎంపిక చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రేవంత్ ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటీ… హైకమాండ్ దృష్టిలో కేసీఆర్ ని ఎదుర్కొనగలిగే ధీటైన నాయకుడు తానే అని మరోసారి చెప్పుకోవడం. రెండోది… టి. కాంగ్రెస్ నేతల్లో తనకు మద్దతు నిలిచేవారి సంఖ్య పెంచుకోవడం. మొదటిది తాను ఇలా మీడియా ముందు మాట్లాడితే సరిపోతుంది. కానీ, రెండో వ్యూహం అమలే కాస్త శ్రమించాల్సింది.
టి. కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడో టాక్ ఏంటంటే… కొంతమంది సీనియర్లు అంటే, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, దామోదర్ రాజనర్సింహ, జానారెడ్డి లాంటివాళ్లతో రేవంత్ ఈ మధ్య దోస్తీ పెంచుకుంటున్నారని! నాలుగు రోజుల కిందట సొంత ఆఫీస్ ప్రారంభోత్సవంలో వీళ్లలో కొంతమంది కనిపించారు. ఇలా తన వర్గాన్ని, తనకు మద్దతుగా నిలిచే నాయకుల సంఖ్యను పెంచుకునే వ్యూహంలో రేవంత్ ఉన్నట్టు సమాచారం. పీసీసీ అధ్యక్ష పదవి తనకు ఇస్తేనే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కల్పించడం కోసం అన్ని రకాలుగా రేవంత్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా కనిపిస్తోంది.