కమ్మ మహా సభలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణలో నిరసన తెలిపేందుకు నిరాకరించడమే బీఆర్ఎస్ పతనానికి దారితీసిందని వ్యాఖ్యానించిన రేవంత్.. పరోక్షంగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ వ్యవహరశైలిని ఎత్తిచూపారు.
తెలంగాణ ఉద్యమం కొనసాగుతోన్న సమయంలో అగ్రరాజ్యం అమెరికాలో సైతం తెలంగాణ వాదులు నిరసన తెలిపారని.. కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే నిరాకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పర్యవసానమే బీఆర్ఎస్ అధికారం కోల్పోయేందుకు కారణమైందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న కేటీఆర్!
చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ గతేడాది ఏపీకి చెందిన పలువురు హైదరాబాద్ లో నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలో అరెస్ట్ జరిగితే అక్కడే నిరసన తెలపాలని.. ఇక్కడేలా నిరసన తెలుపుతారని వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నాడు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఖండాంతరాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ నిరసన తెలిపారు. కానీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే కేటీఆర్ వెకిలిగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది.
ఫలితంగా టీడీపీ సానుభూతిపరులంతా బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యవహారశైలి వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు రేవంత్.