తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి విశ్లేషించాలంటే ఓటుకు నోటు ముందు ఆ తర్వాత అని విడగొట్టాల్సి ఉంటుంది. అంత ప్రాధాన్యం ఉన్న ఆ వ్యవహారంలో తెలంగాణ టిడిపిలో అగ్రగామి లీడర్ రేవంత్‌రెడ్డి పాత్ర ఏమిటనేది అందరూ టీవీల సాక్షిగా చూసిందే. విచిత్రమేమిటంటే… ఆ వ్యవహారం తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి శరవేగంగా క్షీణించిపోతూ వచ్చింది. అదే సమయంలో ఒక నాయకుడిగా ఆ వ్యవహారంలో కీలక పాత్రధారి అయిన రేవంత్‌రెడ్డి మాత్రం అంతకంతకూ ఎదుగుతూ రాష్ట్ర స్థాయి నేతగా ఓ మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసియార్ గురించి అత్యంత పరుషంగా మాట్లాడే దమ్మున్న ఏకైక తెలంగాణ లీడర్‌గా మారారు.
మరోవైపు… ఓటుకు నోటు వ్యవహారం తర్వాత పరిణామాలు చిత్ర విచిత్రంగా మారిపోతూ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య సంబంధాలు అనూహ్య మలుపులు తిరుగుతూ రాజకీయ విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేసేశాయి. తొలుత పరస్పరం బద్ధశత్రువుల్లా కత్తులు దూసుకున్న ఇద్దరు చంద్రులు ఆ తర్వాత ఒకే ఒరలో ఇమిడిపోయేంత దగ్గర మిత్రులుగా మారిపోయారు. రాజకీయ వైరాలను తోసిరాజన్నారు. అది ఏ స్థాయికి వచ్చిందంటే… వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, తెరాస కలిసి పోటీ చేస్తాయనే బలమైన అంచనాలు ఏర్పడే దాకా. ఈ అంచనాలను అధినేత ఏ మాత్రం ఖండించకపోవడం, తెలంగాణ ప్రాంత తెదేపా నాయకుల్లో అత్యధికులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తుండడం… ఇవన్నీ ఇప్పటిదాకా తెదేపా తరపున ఏకైక ఫైటర్‌గా తొడగొడుతున్న రేవంత్‌రెడ్డికి గొంతులో పచ్చి వెలక్కాయలా మారి మింగలేని కక్కలేని పరిస్థితిని కల్పించాయి. ఈ నేపధ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వచ్చారు.
ఇక ఇటు కాంగ్రెస్ కూడా తెలంగాణ ప్రాంతంలో నాయకత్వలేమితో కొట్టు మిట్టాడుతోంది. అనుకున్న స్థాయిలో కెసియార్‌ను ఎదుర్కోలేకపోతున్న వృధ్ధనాయకులపైన అధిష్టానం పూర్తిగా నమ్మకం పోగొట్టుకుందని సమాచారం. దీంతో రేవంత్‌రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ తమ పార్టీకి తప్పకుండా ఉపయుక్తమైన ఆయుధం అవుతాడని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించడంలో అసహజమేమీ లేదు. అందుకే రేవంత్‌ను పార్టీలోకి వెల్కమ్ చెప్పడానికి అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవిని కట్టబెట్టడానికి కూడా కాంగ్రెస్ రెడీ అయిపోయిందని వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ వార్తలకు గత రెండ్రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేయడం మరింత ఊతం ఇచ్చింది. నిజానికి మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్‌తో రేవంత్ రహస్యంగా సమావేశం అవ్వాలనుకున్నాడట. అయితే ఈ విషయం కాస్తా బయటకు పొక్కడం, మీడియా మొత్తం రాహుల్ ఇంటికి క్యూ కట్టడంతో ఈ సమావేశం రద్దయిందని సమాచారం. అయితే రేవంత్ మాత్రం… ఇటీవల తెరాస వ్యవస్థాపక దినోత్సవాల కోసం నిధుల సేకరణ వ్యవహారంలో జరిగిన అవకతవకల గురించి తను ఢిల్లీకి కెసియార్‌పై, తెరాసపై సిబిఐకి ఫిర్యాదు చేయడానికి తను ఢిల్లీకి వచ్చానని చెబుతున్నాడు. ఏదేమైనా… మారుతున్న పరిణామాలను బట్టి మరికొన్ని రోజుల్లో రేవంత్‌రెడ్డి భవితవ్యం తేలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.