మీకు నేను అడ్డం అయితే ఓ మెట్టు దిగుతా.. నేను లీడర్ కాను .. నన్ను తిట్టినా పట్టించుకోను అందరూ కాంగ్రెస్ లోకి వచ్చేయండి అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలకు..కాంగ్రెస్ లో చేరుతారనుకుంటున్న నేతలకు పిలుపునిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో చాలా మంది నేతలు ఇక కాంగ్రెస్ లో చేరుతారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. వారందర్నీ మోటివేట్ చేయడానికి .. రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు. పార్టీని వీడిపోయిన వాళ్లందరూ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీలు వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావాలన్నారు. సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే… ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటున్నారని ..అయితే రేవంత్ రెడ్డి సారీ చెబితే చేరడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి తాను ఓ మెట్టు దిగడానికి సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ మార్పు వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఖండించారు. తాము కాంగ్రెస్ లోకి వస్తాం కానీ రేవంత్ అడ్డం అనే నేతలు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. రేవంత్ రెడ్డి ఇలా త్యాగం కార్డు ప్లే చేస్తున్నారని.. హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే రేవంత్ వర్గీయులు మాత్రం .. కేసీఆర్ వ్యతిరేకులందర్నీ పార్టీలోకి తెచ్చేందుకు రేవంత్ సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.