తెలంగాణ రాజకీయాలు దళితులు, గిరిజనుల చుట్టూ తిరుగుతున్నాయి. కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేసి ఆ వర్గం మద్దతును ఏకపక్షంగా పొందుదామని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి విరుగుడుగా రేవంత్ దళితులతో పాటు గిరిజనుల్ని కూడా కలుపుకుని కొత్త రాజకీయ పోరాటం ప్రారంభించారు. దళిత -గిరిజన దండోరా పేరుతో ఇంద్రవెల్లిలో నేడు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలను అన్నిజిల్లాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఓ సభకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించనున్నారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. పది లక్షలు ఇచ్చేలా కేసీఆర్ దళిత బంధుకు పథకం సిద్ధం చేశారు. వాసాలమర్రిలో దళితులకు పంచేందుకు కలెక్టర్‌కు నిధులు మంజూరు చేశారు.
ఈ రోజు హుజూరాబాద్‌లోని ఐదు వేల దళిత కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున ఇచ్చేందుకు రూ. ఐదు వందల కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని దళితులందికీ రూ. పది లక్షలు ఇస్తామని.. లక్ష కోట్లు ఖర్చైనా వెనుకాడబోమని కేసీఆర్ చెబుతున్నారు. ఈ క్రమంలో దళితులంతా టీఆర్ఎస్ వైపు నిలబడితే.. విపక్షాలకు ఇబ్బంది అవుతుంది. అయితే ఈ పథకం పక్కా మోసమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎవరికీ నిధులు ఇవ్వరని.. పది మందికో.. ఇరవై మందికో ఇచ్చి అందర్నీ ఆశ పెట్టించి.. ఓట్లు దండుకుంటారని చెబుతున్నారు. అందుకే కోమటిరెడ్డి లాంటి నేతలు కూడా తన నియోజవకర్గంలో దళితలుకు రూ. పది లక్షలు పంపిణీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మరోసారి పోటీ కూడా చేయనని ఆఫర్ ఇచ్చారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి దళితులు, గిరిజనులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని లెక్కలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. దళిత- గిరిజన దండోరాతో… కేసీఆర్ ఎంత మేర దళితులకు ఇవ్వాలో.. ఎంతఇవ్వలేదో.. ఎన్ని నిధులు దారి మళ్లించారో చెప్పాలని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల వరకూ దళిత బంధు వేడిని కొనసాగించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. రేవంత్ కూడా… దండోరాను అదే వేడిలో కొనసాగించాలని అనుకుంటున్నారు. పోటాపోటీగా దళిత – గిరిజనుల ఓట్ల కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.