మూసి పునరుజ్జీవం పాదయాత్ర సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. మూసి ప్రక్షాళన అడ్డుకుంటే కుక్క చావు చస్తారని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్‌లపై రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలను దాటి కాస్త ఎక్కువ తిట్టేశారు. ఆయన అలా కేసీఆర్ ఫ్యామిలీని ఘాటు భాషలో తిట్టడం ఇదే మొదటి సారి కాదు. వారిపై విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడల్లా రేవంత్ ఆ భాషకు మారిపోతారు. ఇతరుల విషయంలో ఆయన సంయమనంతోనే ఉంటారు. కానీ బీఆర్ఎస్ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఆయన అలాంటి రూల్స్ పెట్టుకోరు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించేటప్పుడు రేవంత్ రెడ్డి గీత దాటుతున్నట్లుగా కనిపిస్తూండటంతో విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నారని.. ఆ స్థానం గౌరవాన్ని చెడగొట్టవద్దని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో వారికీ సానుభూతి రాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లు వాడిని భాషా ప్రయోగాలను జనం మర్చిపోయినా..కాంగ్రెస్ నేతలు మర్చిపోలేరు. అందుకే రేవంత్ భాషను కాంగ్రెస్ క్యాడర్ కూడా ఎంజాయ్ చేస్తోంది.
తనపై విమర్శలు వస్తున్నా రేవంత్ ఎందుకు అదే భాషను పదే పదే కొనసాగిస్తున్నారు అంటే.. దాని వెనుక పగ, ప్రతీకారాలు ఏమీ లేవని.. రాజకీయం మాత్రమే ఉందని కాంగ్రెస్ వ్యూహకర్తలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతల్ని.. క్యాడర్ ను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. చిట్ చాట్లలో ఏడాదిలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెబుతూంటారు. ఇలాంటివి విన్నప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ కు లీడర్ కోపం వస్తుంది. అది రేవంత్ కు తెలియక కాదు., కానీ చేస్తూనే ఉన్నారు. ఇదంతా కేసీఆర్ బయటకు వచ్చేలా చేయడానికని.. కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.