తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అనుముల రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. నెలల తరబడి కసరత్తు చేసి.. చివరికి..అటూ ఇటూ ఊగిసలాడినా… రేవంత్ రెడ్డి తప్ప మరొకరు కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించలేరన్న నిర్ణయానికి వచ్చి.. అధికారిక నిర్ణయం తీసుకుంది. ఐదుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చాన్సిచ్చారు. అజారుద్దీన్.. గీతారెడ్డి, అంజన్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్ గౌడ్లు ఈ జాబితాలో ఉన్నారు. సీనియర్ నేతలందరికీ ఏదో ఓ పదవి ఇచ్చారు. మధుయాష్కీకి ప్రచార కమిటీ చైర్మన్ పదవి.. దామోదర్ నర్సింహకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయనకు ఏఐసీసీలో చోటు కల్పిస్తారని భావిస్తున్నారు. వీహెచ్‌కు కూడా ఎక్కడా ప్రాతినిధ్యం దక్కలేదు.
పీసీసీ అధ్యక్ష పదవికి చాలా కాలంగా రేసు జరుగుతోంది. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి… తామంటే తాము అని పోటీ పడ్డారు. అన్నిరకాల అభిప్రాయ సేకరణలు జరిపిన కాంగ్రెస్ హైకమండ్.. అనేక సార్లు రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించాలని నిర్ణయించుకుంది. కానీ అదే సమయంలో.. రేవంత్ రెడ్డిపై వివిధ కేసులు బనాయించి అరెస్టులు చేస్తూ వస్తూండటంతో.. ప్రకటనలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ లోపు ఎప్పట్నుంచో కాంగ్రెస్‌లో ఉన్న వారికి పదవి ఇవ్వాలంటూ.. డిమాండ్లు కూడా వినిపించడం ప్రారంభించారు. చివరికి హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవసానదశలో ఉంది. పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారో… ఎవరు కోవర్టులుగా పని చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొనేది ఒక్కరేవంత్ రెడ్డి మాత్రమేననేది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అభిప్రాయం. చివరికి క్యాడర్ అభిప్రాయం… ప్రకారం… హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు.. రేవంత్ రెడ్డి భుజాలపై అతి పెద్ద బాధ్యత ఉంది. కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్ని తట్టుకుంటూ…ఆయన పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాల్సి ఉంది.