తెలంగాణ రాజకీయాలు మళ్లీ పాత పద్దతికి పోతున్నాయి. పాలన విషయం పక్కన పెడితే రాజకీయ విమర్శలు దారి తప్పుతున్నాయి. భాష గీత దాటిపోతోంది. మార్పు వచ్చిందని ఆశిస్తున్న ప్రజలకు నిరాశే కలుగుతోంది. రాజకీయ నేతల భాష చూసి సాధారణ ప్రజలు కూడా నిర్వేదం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తోంది.
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ భాష చాలా అభ్యంతరకరంగా ఉండేది. కానీ ఆయన భాషకు ఓ లెక్క ఉంటుంది. ఉద్యమం హైప్ అంతా ఆయన మాటల్లోనే ఉంది. అందుకే అందుకే.. ఎన్ని విమర్శలు వచ్చినా ఆ భాషను కొనసాగించారు. తర్వాత తెలంగాణ రాజకీయ నేతలు మా గురువు కేసీఆరే అని ప్రకటించి అదే భాషా ప్రయోగం చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారం రోత పుట్టే స్థాయికి వెళ్లడంతో ఓ సమయంలో రాజకీయ నేతలు కూడా రియలైజ్ అయ్యారు. కాస్త కంట్రోల్లో ఉండటం ప్రారంభించారు.
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో.. ఇక అలాంటి లాంగ్వేజ్ కు చోటు ఉండదని అనుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి అదే లాంగ్వేజ్ ప్రయోగించారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత … కూడా అదే భాషను కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడుకూడా గీత దాటారు. అయితే ఆయన దాటారని.. రేవంత్ రెడ్డి కూడా అదే భాషను పదవిలో ఉన్నప్పుడు ప్రయోగించడం అంత సముచితం అనిపించుకోదని సామాన్యుల భావన. రేవంత్ కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలూ అదే భాషను ఎంచుకుంటున్నారు. ఫలితంగా… నీకంటే నేను భాషా ప్రవీణుడని నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారు.
రాజకీయాల్లో హుందా తనాన్నిప్రజలు కోరుకుంటారు. ఇలా తిట్లందుకుంటే..తాత్కలికంగా కొంత మంది సంతోషపడవచ్చు కానీ.. దీర్ఘ కాలంలో నష్టం చేస్తుంది. అందుకే తెలంగాణ నేతలు పార్లమెంటరీ భాషనే వాడటం ప్రారంభిస్తే…రాజకీయానికే ఎంతో మేలు జరుగుతుంది.