నిబంధనలకు విరుద్దంగా తన కుటుంబ సభ్యులు అక్రమ కట్టడాలు నిర్మించినట్లు చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎఫ్ టీ ఎల్ , బఫర్ జోన్ లో ఎవరు నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా వెనక్కి తగ్గబోదని తెలిపారు. తన మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని, పార్టీలతో సంబంధం లేదని అన్నారు.
హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే పరిమితమన్న రేవంత్..అక్రమ కట్టడాలు ఓల్డ్ సిటీలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా కూల్చివేతలు ఖాయమని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయని అయినా వెనక్కి తగ్గబోమని వ్యాఖ్యానించారు.
ఫామ్ హౌజ్ నిర్మాణం కోసం సర్పంచ్ దగ్గర అనుమతి తీసుకున్నామని కేటీఆర్ అంటున్నారని.. సర్పంచ్ ఎలాంటి అనుమతులు ఇవ్వరన్న సంగతి పదేళ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్ కు తెలియదా? అంటూ ప్రశ్నించారు.
కవిత బెయిల్ పై స్పందిస్తూ.. సిసోడియాకు బెయిల్ రావడానికి పదిహేను నెలలు పట్టింది.. కేజ్రీవాల్ కు ఇంకా బెయిల్ రాలేదు. కవితకు మాత్రం ఐదు నెలల్లోనే బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందనుకుంటున్నానన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేసిందని ఆరోపించారు.