కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు ఒక కొలీక్కి వచ్చేసింది. తాత్కాలికంగా ఏఐసీసీ పగ్గాలను సోనియా గాంధీ చేపట్టడంతో ఇప్పుడు రాష్ట్రాలపై హైకమాండ్ దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని సెప్టెంబర్ మొదటివారంలో ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం. మొదట్నుంచీ వినిపిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి పేరునే పీపీసీ ఛీఫ్ గా అధిష్టానం ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ తోపాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా రెండో ఆప్షన్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. నిజానికి, పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సుధీర్ బాబులు కూడా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వీర విధేయులకు పదవి ఇవ్వాలంటూ ఆ మధ్య సీనియర్ నేత వీ హన్మంతరావు పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో ఎవరిని కాదంటే ఎవరు హర్ట్ అవుతారో అనే అనిశ్చితి ఉండనే ఉంది. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం ముందుగానే హైకమాండ్ చేసింది. కొంతమంది నేతల్ని వ్యక్తిగతంగా ఢిల్లీకి పిలిచి మాట్లాడినట్టు సమాచారం. అయితే, రేవంత్ రెడ్డి పేరు ప్రకటిస్తే పెద్ద ఎత్తున పార్టీలో వ్యతిరేకత వస్తుందా, గత ఎన్నికల ముందు వచ్చి చేరిన నాయకుడికి ఇంత ప్రాధాన్యత ఇస్తారా అనే అసంతృప్తి వ్యక్తమౌతుందా అనే ఆలోచన హైకమాండ్ కీ ఉంది. అందుకే, రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితులు, భాజపా, తెరాసలను ధీటుగా ఎదుర్కొనగలిగే నాయకుడు అవసరం ఉందని నచ్చజెప్పే ప్రయత్నమూ చేస్తున్నట్టు సమాచారం!
ప్లాన్ -బిలో భాగంగా ప్రస్తుతానికి జీవన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసి, సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే సమయంలో రేవంత్ కి బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే ప్రత్యామ్నాయ ఆలోచన కూడా హైకమాండ్ కి ఉందని తెలుస్తోంది. అలా చేయడం వల్ల ప్రస్తుతం పార్టీలో తలెత్తే వ్యతిరేక పరిస్థితుల్ని నివారించొచ్చు అనేది వ్యూహం. అయితే, ఎన్నికల వరకూ జీవన్ రెడ్డిని కొనసాగించి… ఆ సమయంలో రేవంత్ కి బాధ్యతలు అప్పగించడం అనేది కూడా సరైన వ్యూహంగా కనిపించడం లేదు! ఎందుకంటే, ఎన్నికల లక్ష్యంగానే పీసీసీ అధ్యక్షుడి వ్యూహాలూ కార్యాచరణ ఉండాలి. ఎన్నికలప్పుడు మరొకరు వస్తారులే అని ఇప్పుడే నిర్ణయిస్తే… బాధ్యతల్ని నూటికి నూరు శాతం నిర్వర్తించడంలో కొంత అలసత్వానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు కూడా ఈ ఆశావహుల హడావుడి ఉండదని చెప్పలేం. మొత్తానికి, రేవంత్ అయితేనే తెరాస భాజపాలను సమర్థంగా ఎదుర్కొంటారు అనే పూర్తి నమ్మకం హైకమాండ్ కి ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాని ప్రకారమే సెప్టెంబర్ 8లోపు ప్రకటన ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.