గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి ఫార్ములా ఆశించిన విజయం దక్కించుకోలేకపోయింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చరిత్రలో తొలిసారిగా మిత్రపక్షాలుగా బరిలోకి దిగి విమర్శలు పాలయ్యాయి. ఆ తరువాత, ఈ రెండు పార్టీలూ ఎవరి దారి వారిది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీడీపీ సొంతంగానే బరిలోకి దిగింది. త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సొంతంగానే పోటీకి సిద్ధమౌతోంది. అయితే, మరోసారి టీడీపీ సాయం కోసం ప్రయత్నిస్తున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఆ పార్టీ సాయాన్ని కూడా తీసుకోవాలంటూ నాయకులకు సూచించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల్లో నెగ్గాలంటే వ్యూహమూ ఎత్తుగడ ఉండాలని నాయకులకు చెప్పారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్లంతా మనకు సహకరించారనీ, కమ్యూనిస్టులు కూడా సాయం చేశారన్నారు. వీళ్లతోపాటు తెరాసలో ఉంటూ, కేసీఆర్ విధానాలు నచ్చనివారు కూడా పరోక్షంగా సహకరించారన్నారు. ఇవాళ్ల మరోసారి వాళ్లందర్నీ కలుపుకుని పోవాలనీ, వాళ్లతో కూర్చుని సాయం కోరాలంటూ కాంగ్రెస్ నాయకులకు రేవంత్ సూచించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలన్నారు. ఒక్క తెరాస బీ-ఫామ్ అందుకున్న అభ్యర్థి మాత్రమే మన శత్రువనీ, మిగతావారందరూ మన మిత్రులే అన్నారు. అందర్నీ ఒక వేదిక మీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. తెరాసలో టిక్కెట్లు ఆశించి, దక్కనివారు కూడా ఉంటారనీ, వాళ్లని కూడా మనం లైన్లో పెట్టాలనీ, గెలవాలంటే పక్కా వ్యూహంతో మనం ముందుకెళ్లాలంటూ రేవంత్ అన్నారు.
రేవంత్ సూచన బాగానే ఉందిగానీ, దీన్ని ఇతర కాంగ్రెస్ నేతలు ఎలా తీసుకుంటారనేదే ప్రశ్న? ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికల తరువాత టీడీపీతో పొత్తు వల్లే ఓడిపోయామని విశ్లేషించుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే పార్టీతోపాటు, మహా కూటమి తరహాలో అందర్నీ కలుపుకుని పోదామంటే ఆ పార్టీ నాయకుల్లో చాలామంది వ్యతిరేకిస్తారు. రేవంత్ రెడ్డి ఏ హోదాలో ఈ ప్రతిపాదన చేశారనే చర్చా కాంగ్రెస్ లో మొదలవొచ్చు. పరోక్షంగా మరోసారి పొత్తుకు రేవంత్ ప్రతిపాదించినా.. కాంగ్రెస్ తో కలిసి వెళ్లే ప్రయత్నం టీడీపీ ఇప్పుడు చేసేలా కనిపించడం లేదు. ఇక, మిగిలింది కమ్యూనిస్టులు, వీళ్ల వైఖరి ఏంటనేది ఇంకా స్పష్టం కావల్సి ఉంది.