అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ సీఎం , ఉప సీఎంలకు హైకమాండ్ బాధ్యతలు ఇచ్చింది. తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న మహారాష్ట్ర ఎన్నికలకు రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా వెళ్లనున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రచారం జోరందుకుంటోంది. త్వరలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ నుంచి వెళ్లిన ముంబైలో స్థిరపడిన తెలంగాణవాసులు లక్షల్లో ఉంటారు. ఇతర ప్రాంతాల తెలుగువారు కూడా ఎక్కువే. ఇక నాందేడ్ తో పాటు హైదరాబాద్‌తో దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనూ రేవంత్ ప్రచారం. చేసే అవకాశం ఉంది.కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ పెట్టి ఎంతో కొంత బలం చూపించాలనుకున్నది ఈ ప్రాంతాలపై నమ్మకంతోనే. కానీ ఆయనకు కాలం కలసి రాలేదు. తెలంగాణ, మహారాష్ట్రతో కలిపి యాభై లోక్ సభ సీట్లు సాధించాలనుకున్న ఆయన జీరో దగ్గరే ఆగిపోయారు. ఇప్పుడు తెలంగాణ నుంచే స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ తమ పార్టీ విజయం కోసం మహారాష్ట్ర వెళ్తున్నారు.
ప్రభుత్వంలో నెంబర్ టుగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు కూడా హైకమాండ్ ప్రాధాన్యం ఇస్తోంది, ఆయనకు జార్ఖండ్ బాధ్యతలు ఇచ్చారు. అక్కడ రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత ప్రచారం ఊపందుకుంది. అందుకే బట్టి ఇప్పటికే అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.