తెలంగాణ కాంగ్రెస్ లో ఒకరిపై ఒకరు పెత్తనం చేయడానికి తామే కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చామని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతర్గతంగా జోరుగా సాగుతూనే ఉన్నాయి. పార్టీలో చేరేందుకు బహిరంగసభ ఏర్పాటు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి.. ఆయనను పార్టీలో చేర్చేందుకు ఒప్పించిన రేవంత్ రెడ్డి కి వీలైనంత మైలేజీ లేకుండా… అది ఒక్క పొంగులేటి క్రేజ్ కాదని.. ..అందులో భట్టి విక్రమార్కకూ వాటా ఉందని నిరూపించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఆ సభలోనే భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు ప్రకటన చేయాలని డిసైడయ్యారు.
పొంగులేటి తన చేరిక సభను.. తన విషయానికే పరిమితం చేయాలని అనుకున్నారు. కానీ భట్టి పాదయాత్ర ముగింపు కోసం వేరే సభ ఏర్పాటు చేస్తామని దానికీ రాహుల్ గాంధీ వద్ద భట్టి వర్గానికి చెందిన కొంత మంది ప్రపోజల్ పెట్టారు. రెండు ఎందుకు ఒక్కటి చాలు అంటారని వారికి తెలుసు… అందుకే అలాగే చేశారు. చివరికి వారి ప్లాన్ వర్కవుట్ అయింది. అయితే రేవంత్ రెడ్డి కానీ పొంగులేటి కానీ… దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. పైగా భట్టి పాదయాత్ర వద్దకు వెళ్లి ఆయనను పొగిడారు. గొప్పగా పాదయాత్ర చేశారన్నారు. భట్టి పాదయాత్ర వల్లే ప్రభుత్వం పోడుపట్టాలు పంపిణీ చేసిందని క్రెడిట్ కూడా ఇచ్చారు.
రేవంత్ రెడ్డి తను పార్టీలో బహిరంగంగా ఒక్క నేతను కూడాదూరం పెడుతున్నట్లుగా వ్యవహరించడం లేదు. అందర్నీ దగ్గరుక తీసుకుంటున్నారు. కోమటిరెడ్డి లాంటి వాళ్లు క్షమాపణలు చెప్పాలంటే చెప్పేస్తున్నారు. అయితే అంతర్గతంగా ఆయన చేసే రాజకీయం వేరుగా ఉంటుందని ఆయనను వ్యతిరేకిస్తున్నవారు అంటున్నారు. కేసీఆర్ ను ఓడించే లక్ష్యం మాత్రమే రేవంత్ పెట్టుకున్నారని అందులో కలసి వచ్చే వారిని తప్పా ఇంకెవర్నీ రేవంత్ ఎంటర్ టెయిన్ చేయరని ఆయన వర్గాలంటున్నాయి. మొత్తానికి రేవంత్… తనను వ్యతిరేకించే వారినీ బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారు. ఇది హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేయడానికి అవకాశం కల్పిస్తోంది.