WIN – WIN సెట్యువేషన్ అనే మాట తరచూ వింటుంటాం. పరస్పర సహకారంతో, తోడ్పాటుతో.. చేయి చేయి కలిసి ముందుకు సాగిపోవడం. అది అన్ని విధాలా, అందరికీ మేలైన, ఆమోదయోగ్యమైన ప్రయాణం.
కానీ చిత్రసీమతో ప్రభుత్వ వైఖరి మాత్రం ఇలా లేదు. `మా ఇంటికొస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్` అన్న చందాన తయారైంది.
సినిమావాళ్లు ప్రభుత్వానికి కావాలి. ప్రభుత్వ తోడ్పాటు సినిమావాళ్లకు అవసరం. ఇద్దరూ సరస్పర సహకారంతో ముందుకు సాగాలి. కానీ రేవంత్ రెడ్డి వైఖరి ఇందుకు పూర్తి రివర్స్ లో ఉంది. ఎందుకనో.. ముందు నుంచీ సినిమావాళ్లంటే ఆయన చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా యాడ్స్ చేయకపోతే.. సినిమా టికెట్ల రేట్లు పెంచుకొనే వెసులు బాటు ఇచ్చేదే లేదని ఆయన స్ట్రయిట్ గా ఓ వార్నింగ్ లాంటిది ఇచ్చారు. దాంతో అప్పటికప్పుడు బడా స్టార్లు యాడ్లు చేయాల్సివచ్చింది. ఇప్పటికీ ఇదే రూలు. ఏదైనా పెద్ద సినిమా విడుదల అవుతుంటే.. అందులోని హీరో, యాంటీ డ్రగ్స్ యాడ్ చేయాలి. లేదంటే… పెద్ద పేచీ వచ్చేస్తుంది.
ఎన్.కన్వెన్షన్ని హైడ్రా కూలుస్తున్నప్పుడు రేవంత్ ఏమాత్రం కనికరించలేదు. హైడ్రా తన పని తాను చేసుకొని పోయింది. అల్లు అర్జున్ వ్యవహారంతో సినిమావాళ్లపై రేవంత్ రెడ్డి వైఖరి ఎలాంటిదో పూర్తిగా అర్ధమైపోయింది. `సినిమావాళ్లేమైనా ప్రత్యేకమా.. వాళ్లు కూడా పక్కా వ్యాపారస్థులే` అంటూ స్టేట్మెంట్ విసిరారు. అసెంబ్లీలో సంధ్య ధియేటర్ ఇష్యూని లేవనెత్తి, ఎవర్నీ వదిలిపెట్టేది లేదన్నారు. స్పెషల్ షోలు, రాయితీల విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు.
ఇవన్నీ సినిమావాళ్లకు కంగారు తెప్పించే విషయాలే. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం మినహా మరో దారి లేదు. అందుకే ఈరోజు మీటింగ్ కోసం సినీ ప్రముఖులంతా టంచనుగా హాజరైపోయారు. ఈ సమావేశంలో సినిమావాళ్లకు ప్రభుత్వం తరపున హామీలు వచ్చే అవకాశం ఏమాత్రం కనిపింలేదు. పైగా.. సినిమావాళ్లకు ప్రభుత్వం కొన్ని పనులు అప్పగించింది. యాంటీ డ్రగ్స్, ఉమెన్ సేఫ్టీ, టూరిజం డవలెప్మెంట్… ఇలా ఏడెనిమిది బాధ్యతలు సినిమావాళ్ల నెత్తిమీద వేసింది. వీటికి స్టార్లు సహకరించాలి. సినిమా విడుదలకు ముందు యాంటీ డ్రగ్స్ యాడ్ ఎలా చేసేవారో.. అలా.. ఏడాది పొడవునా ఏదోటి చేస్తూండాలి. ఇదీ.. రేవంత్ రెడ్డి పెట్టిన కండీషన్.
అది సరే…
ఎప్పటి నుంచో ఆగిపోయిన నంది అవార్డుల మాటేంటి?
స్పెషల్ షోలు ఉంటాయా ఉండవా?
టికెట్ రేట్లు పెంచుకొనే సౌలభ్యం ఉందా లేదా?
సింగిల్ విండో సిస్టమ్ ఉంచుతారా, ఎత్తేస్తారా?
హైదరాబాద్ లో షూటింగులు చేసుకొంటే రాయితీలు ఇస్తారా, ఇవ్వరా?
ప్రపంచ సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా రేవంత్ రెడ్డి తీసుకోబోయే చర్యలేంటి?
– వీటిపై మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి అభయ హస్తమూ లేదు. అంటే ప్రభుత్వం తీసుకోవడం తప్ప, ఇచ్చేదేం ఉండదు. ఇది ఫిక్స్.
ఎందుకో జగన్ రెడ్డి సర్కారు పనితనం, ఆ ప్రభుత్వ హయాంలో చిత్రసీమ పడిన ఇబ్బందులు గుర్తుకు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకూ సినిమావాళ్లెవరూ సంతోషంగా లేరు. జగన్ ఎప్పుడు దిగిపోతాడా? అని ఎదురు చూశారు. అనుకొన్నదే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? ఏమో.. అవ్వొచ్చు. ఎందుకంటే సినిమావాళ్ల ఎమోషన్స్ తో ఆడుకొన్న ఏ ప్రభుత్వమైనా పతనానికి తన గోతులు తానే తవ్వుకొన్నట్టు చరిత్ర చెప్పింది.