పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని అంటారు కానీ రెండూ ఇంటర్ లింక్డ్ అని అందరికీ తెలుసు. పాలనలో తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ కోణంలోనే ఉంటుంది. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోరు. అయితే ప్రస్తుత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ రాజకీయంగా లాభం జరుగుతుందా.. నష్టం జరుగుతుందా అన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉండి.. మొత్తం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
కేంద్ర మంత్రులతో సీఎం పనిగట్టుకుని మరీ సమావేశాలు
రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తున్నారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైకమాండ్ ను కలవడానికి మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైకమాండ్ ను కలవడానికన్నా.. కేంద్ర మంత్రులతో భేటీలకే ఎక్కువ వెళ్తున్నారు. ప్రధానితో భేటీకి ఆయన తరచూ ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడు వెళ్లి కలసి వస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులు ఎవరైనా తెలంగాణకు వస్తే ఇంటికి పిలిపించి సన్మానిస్తున్నారు. అలా కుదరకపోతే మంత్రుల్ని ఎయిర్ పోర్టుకు పంపి స్వాగతిస్తున్నారు. ఈ పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
కేంద్ర మంత్రులతో సన్నిహితంగా కాంగ్రెస్ నేతలు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తనకు పరిచయం ఉన్న నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. నితిన్ గడ్కరీతో ఆయనకు మంచి పరిచయం ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా వెళ్లి కలిసి పరిచయాలు పెంచుకుంటున్నారు. మంగళవారం మరోసారి వెళ్తున్నారు. అలాగే ఇతర మంత్రులు కూడా తగ్గడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎవరితో అయినా భేటీ అవుతామని రేవంత్ చెబుతున్నారు. తాము ఢిల్లీకి పర్యటించడం వల్లనే కొన్ని పనులు అవుతున్నాయని అంటున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ కు సందేహాలు
కాంగ్రెస్ మంత్రులు, సీఎం ఇలా అవసరానికి మించి కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్ కు అభిప్రాయం ఏర్పడితే పార్టీ నేతలకు ఇబ్బందులు వస్తాయి. అయినా కాంగ్రెస్ నేతలు మాత్రం తమ నిజాయితీని హైకమాండ్ శంకించదన్న నమ్మకంతో తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. కానీ హైకమాండ్ కు .. కొన్ని విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమ చేతి నుంచి జారిపోతుందేమోనన్న అభిప్రాయానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నది భావన వ్యక్తమవుతోంది.