కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నలభై లక్షల మంది సభ్యులు ఉన్నారు. డిజిటల్ మెంబర్షిప్ అంశంపై రాహుల్ గాంధీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 14 మంది ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించారు. రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన నిర్వహించిన సభ్యత్వ నమోదుపై, వారికి ఇన్య్సూరెన్స్ చేయించడంపై వివరించారు.ఒక్కో కార్యకర్తకు 2 లక్షల భీమా కల్పించారు. దీనికి సంబందించిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీకి 6.34 కోట్ల చెక్కును రాహుల్ గాంధీ కి అందజేశారు.
రేవంత్ రెడ్డితో పాటు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేయలేదని తెలుస్తోంది. అయితే గతంలో లేని విధంగా డిజిటల్ మెంబర్ షిప్ పెద్ద ఎత్తున చేయడం.. తెలంగాణలో కార్యక్రమాలు పుంజుకోవడంపై రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి వచ్చే వారిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సహించడం లేదు.
ఈ క్రమంలో సభ్యత్వ నమోదుతో రేవంత్ మరిన్ని మార్కులు హైకమాండ్ వద్ద పొందారు. రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశం తర్వాత ఇక సీనియర్లు ఎవరూ అసంతృప్త స్వరం వినిపించే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఎవరైనా గీత దాటితో కఠిన చర్యలు తీసుకుంటారన్న సూచనలు ఇప్పటికే వచ్చాయి.