గత కొంతకాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొదలుపెట్టింది. పంట ఎండిపోతుందని, సాగుకు విద్యుత్ అందటం లేదని, ధాన్యం కొనుగోలు ఏమైందని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేతలంతా మూకుమ్మడిగా రేవంత్ సర్కారుపై దాడి చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఓ అడుగు ముందుకేసి తాను రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేస్తానని… ఓ పూట ప్రచారం, మరో పూట రైతుల దగ్గరకు వెళ్తానంటూ ప్రకటించారు.
దీంతో కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో వెనుకబడిపోతుందేమోనన్న అభిప్రాయం అంతటా మొదలైంది. వందరోజుల లోపు రుణమాఫీ, క్వింటాలుకు 500రూపాయల బోనస్ పై రేవంత్ రెడ్డి అసలు రేవంత్ సర్కార్ నోరు విప్పటం లేదంటూ అంతా అనుకుంటున్న దశలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
సాదాసీదా ప్రకటన అయితే, ఎన్నికల స్టంట్ అనుకునే వారు. ఏకంగా భద్రాద్రి రామయ్య సాక్షిగా చెప్తున్నా… రైతు సోదరులందరికీ 2లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నానని, పంద్రాగస్టులోపు చేసి మీ రుణం తీర్చుకుంటానని మాటిచ్చారు. అంతేకాదు వచ్చే పంట నుండి క్వింటాలుకు 500రూపాయల బోనస్ కూడా అమలు చేస్తానని టైం లైన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో రైతుల్లో ఉన్న ఊగిసలాట పోతుందని, ఇదే లైనులో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరు పెంచబోతున్నట్లు స్పష్టంగా కనపడుతోంది.
కేసీఆర్ రైతు రాజకీయాన్ని… రేవంత్ రెడ్డి భద్రాద్రి రామయ్య సెంటిమెంట్ జోడించి మరీ రైతు రాజకీయంతో కొట్టారని, ఒకరకంగా ఇది రేవంత్ రెడ్డి వేసిన యార్కర్ లాంటిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయిందని, ఇందులోనూ రాజకీయం చేయాలనుకుంటే గత ఎన్నికల్లో రుణమాఫీ హమీ ఇచ్చి చేయలేదన్నది కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.