ముఖ్యమంత్రి అంటే ఓ వ్యక్తి కాదు. వ్యవస్థ. ముఖ్యమంత్రి పేరు మీద పాలన సాగుతూ ఉంటుంది. అందుకని అంతా ముఖ్యమంత్రే చేయరు. ఆయన తరపున ఓ బృందం పని చేస్తుంది. ఆ బృందం ప్రధానంగా సీఎంవోలో ఉంటుంది. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచే మొత్తం పరిపాలన జరుగుతుంది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టి వారం గడుస్తున్నా ఇప్పటి వరకూ సీఎంవోను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోయారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు చేస్తున్నారు. తొలి రోజు విద్యుత్ పై చేశారు. ఆ తర్వాత ఆర్థిక శాఖపై.. ఇలా వరుసగా చేస్తూ పోతున్నారు. సోమవారం డ్రగ్స్ నియంత్రణపైనా చేశారు. ఆయన దూకుడుగా పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ తాను తాను చేసే సమీక్షలు.. చేయాలనుకుంటున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఆఫీసే.. సీఎంవో. ఆ సీఎంవో క్రియాశీలకంగా లేకపోతే రేవంత్ రెడ్డి చేసే పని అంతా నిష్ఫలమే. ఈ విషయాన్ని సీఎం గుర్తించడం లేదా అన్నది అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికీ సీఎంవోలో కానీ.. పోలీసు వర్గాల్లో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులే కీలక పదవుల్లో ఉన్నారు. హోంశాఖను కూడా తన వద్దనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఆ శాఖ ప్రక్షాళన విషయంలో దూకుడుగా వ్యవహరించడంలేదు. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహిరంచేందుకు ప్రయత్నిస్తున్నారని అటు కాంగ్రెస్ లోనూ.. ఇటు ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పాలనానుభవం ఇంతకు ముందు లేదు. ఆయన మంత్రిగా కూడా చేయలేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నారు. ఆ తరహాలోనే సీఎంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
గత ప్రభుత్వంలో ప్రాధాన్యం లభించక.. చాలా మంది సీనియర్, సిన్సియర్ అధికారులు లూప్ లైన్ లో ఉండిపోయారు. వారంతా ఇప్పుడు ప్రాధాన్యం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో మెరికల్ని వెదికి పట్టుకుని రేవంత్ తన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి.