ఏదైనా ఓ ప్రభుత్వ ఆస్తిని లీజుకు ఐదేళ్లు, పదేళ్లకు ఇస్తేనే అవినీతి అనే ఆరోపణలు వస్తాయి. భారీగా ఆదాయం వస్తున్న దాన్ని ముఫ్పై ఏళ్లకు లీజుకు ఇచ్చేస్తే ఇంకెన్ని ఆరోపణలు రావాలి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్డును ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పూర్తి చేసింది. ఈ ఔటర్ పై టోల్ గేట్స్ ఉంటాయి. ఫీజులు వసూలు చేస్తారు. ఇప్పుడు ఈ ఔటర్ పై ముఫ్పై ఏళ్ల పాటు టోల్స్ వసూలు చేసుకునే అవకాశాన్ని టెండర్ల ద్వారా ఇచ్చేశారు. ఇందులో భారీ అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కవిత, కేటీఆర్ బినామీల సంస్థే ఆ కాంట్రాక్ట్ దక్కించుకుని ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ నిర్వహణను రాబోయే మప్ఫై ఏళ్లపాటు ప్రవేటు సంస్దకు నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకు సిద్దమైన HMDA గత ఏడాది నవంబర్ 10వ తేదీన టెండర్లు పిలిచింది. 2023 మార్చి 31వ తేది వరకూ గడువునిచ్చింది. ఈ టెండర్లలో క్వాలిఫై అయిన ఐఆర్ బి ఇన్ప్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ 7,272 కోట్ల రూపాయలకు టెండర్ వేసింది. కానీ HMDA కమీషన్ అరవింద్ కుమార్ రూ. 7380 కోట్లకు టెండర్ వేసినట్లుగా ప్రకటించారు. అదనంగా 108 కోట్ల రూపాయలు ఎవరు చెబితే కంపెనీ పెంచిందని రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏప్రిల్ నెల ఔటర్ టోల్ గేట్ ఆదాయం రోజుకు కోటి ఎనభై ఐదు లక్షలని చెబుతున్నారు. ఏడాదికి సుమారుగా 720 కోట్లు ఆదాయం వస్తోందని .. ముఫై ఏళ్లపాటు లీజుకు ఇవ్వడమంటే సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలు చెబుతున్నారు. ఎంత నిర్వహణ బాధ్యతలు తీసుకున్నా ఇంత తక్కువగా ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేయడమేనంటున్నారు.
వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టోల్ గేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ స్కాంపై పూర్తి ఆధారాలున్నాయని… కాంగ్రెస ప్రభుత్వం రాగానే కేటీఆర్ ను జైల్లో పెడతామని ఆయన నేరుగానే హెచ్చరిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సెక్రటేరియట్‌కు వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.