కుటుంబ పాలన అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పట్నుంచో ఉన్నాయి. ఆ ముద్ర ఎప్పట్నుంచో బలంగానే ఉంది. అయితే, తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓ కొత్త లాజిక్ చెప్పారు..! కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేనే లేదన్నట్టుగా ఒక కొత్త విశ్లేషణ చేశారు. భైంసాలో జరిగిన ప్రజా గర్జన సభలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని సోయి లేచి చంద్రశేఖరరావు అంటున్నారని విమర్శించారు. ఆయన 80 వేల పుస్తకాలు చదివిన అని గొప్పగా చెప్పుకుంటరుగానీ, కాంగ్రెస్ పార్టీ – గాంధీ కుటుంబ చరిత్ర చదివినట్టు లేరన్నారు. ఆ చరిత్రను కేసీఆర్ కు తాను గుర్తు చేయాలని అనుకుంటున్నా అన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ బతికున్నంత కాలం ఇందిరాగాంధీ మంత్రి కాలేదన్నారు. నెహ్రూ మరణం తరువాతే ఆమె కేంద్రమంత్రి అయ్యారని రేవంత్ చెప్పారు. ఇందిరా గాంధీ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం రాజీవ్ గాంధీ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. ముష్కరుల తూటాలకు ఆమె బలైన తరువాత, ఈ దేశానికి నాయకత్వం అవసరమైంది కాబట్టే రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు! రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడుగానీ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడుగానీ ఏరోజునా సోనియా గాంధీ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. మానవ బాంబు దాడిలో రాజీవ్ మరణించారనీ, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారన్నారు. ఆ తరువాత, ఇద్దరు చిన్న బిడ్డల్ని ఒళ్లో పెట్టుకుని, ఈ దేశానికి నాయకత్వం అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అడిగితే… ఏడేళ్ల తరువాత రాజకీయాల్లోకి వచ్చారన్నారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తరువాత రెండుసార్లు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చారనీ, కానీ ఆ సమయంలో కూడా మన్మోహన్ సింగ్ లాంటి మేథావిని ప్రధాని చేశారనీ, పదవివైపు కన్నెత్తి చూడలేదన్నారు.
ఈ దేశానికి సరైన నాయకత్వం ఇవ్వడం కోసమే వారు రాజకీయాల్లోకి వచ్చారనీ, పదవులుపై ఆశతో కాదని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. ఇప్పుడు దేశానికి కొత్త నాయకత్వం అవసరం మళ్లీ వచ్చిందనీ, అందుకే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్నారని రేవంత్ చెప్పారు. కాబట్టి, ఆయన నాయకత్వాన్ని సమర్థించి, దేశానికి ప్రధానిని చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డపై ఉందని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని వారసత్వ రాజకీయాలను… దేశానికి నాయకత్వ అవసరంగా ఎంత చక్కగా చెప్పారు రేవంత్..! బహుశా… ఇటీవలి కాలంలో ఏ కాంగ్రెస్ నేత కూడా ఇంత అందంగా వారసత్వ రాజకీయాల గురించి చెప్పి ఉండరేమో కదా!