పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గం హుజూర్ నగర్ ఉప ఎన్నిక త్వరలో ఉందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అక్కడి నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తున్నారని ఉత్తమ్ ప్రకటించేశారు. ఆర్థిక కారణాల దృష్ట్యా పోటీకి దూరంగా ఉందామని అనుకున్నా, కార్యకర్తల కోరిక మేరకు, నియోజక వర్గంలో కాంగ్రెస్ ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో తన భార్య పోటీ చేస్తున్నారని ఉత్తమ్ చెప్పేశారు. అయితే, ఈ నిర్ణయం ఏకపక్షమనీ తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా హుజూర్ నగర్ అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
కార్యనిర్వహాక అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండానే పార్టీలో కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాకు రేవంత్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలనే అంశం ఇంతవరకూ పార్టీలో చర్చ జరగలేదనీ, అయితే స్థానిక నేత అయిన చామల కిరణ్ రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. పద్మావతి పేరును ఎలా ఖరారు చేశారో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తోపాటు, మల్లు భట్టి విక్రమార్క వివరణ కోరాలంటూ కుంతియాను రేవంత్ రెడ్డి కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలపడాల్సిన సమయంలో ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ పోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ లో అంతర్గత లొల్లి మొదలైనట్టుగానే కనిపిస్తోంది. ఇది ముందుగా ఊహించిందే! ఎందుకంటే, పద్మావతిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నప్పుడు ఉత్తమ్ పక్కన ఇతర నాయకులు ఎవ్వరూ లేరు. అది కూడా, తన నియోజక వర్గం పరిధిలో జరిగిన ఓ సమావేశంలో ఆమె పేరును ప్రకటించారు. ఇది సమష్టిగా తీసుకున్న నిర్ణయమా, తన వ్యక్తిగత అభిప్రాయమా అనేది కూడా స్పష్టంగా చెప్పలేదు. అయితే, దీనిపై రేవంత్ స్పందన వేరేలా ఉంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గట్టి పోటీని ఇచ్చే తెరాసపై ఎలా గెలవాలన్నది కాకుండా, ఏ అభ్యర్థిని నిలబట్టాలి, ఆ అభ్యర్థి పేరును ఎవరు ప్రతిపాదించారు, దాన్ని వ్యతిరేకిద్దామా సానుకూలంగా స్పందిద్దామనే అనే చర్చకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందేమో! మొత్తానికి, పార్టీలో మళ్లీ ఇంటి పోరు షురూ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది.