హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై మొదట్లో విమర్శలు చెలరేగినా రెట్టింపు స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. గడిచిన కొన్ని రోజులుగా సీన్ రివర్స్ అయింది. భారీగా ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అసలే కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు సరైన అస్త్రం దొరకక తెగ గింజుకుంటున్న బీఆర్ఎస్.. హైడ్రా ద్వారా కాంగ్రెస్ పై కత్తులు దూసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మూసీ బాధితుల యాత్ర చేపట్టిన బీఆర్ఎస్..ఈ విషయంలో మరింత దూకుడు పెంచాలని పట్టుదలతో ఉంది.
హైడ్రా ఎపిసోడ్ తో బీఆర్ఎస్ ఫుల్ ఫామ్ లోకి వస్తుండగా..ఈ విషయంలో బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారానికి కాంగ్రెస్ ఎలా చెక్ పెట్టనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధులు కేటాయించడం లేదు కానీ..మూసీ బ్యూటిఫికేషన్ కు లక్షా యాభై వేల కోట్లు ఎక్కడివి అని హరీష్ రావు చేసిన ప్రకటన బాగా వైరల్ అవుతోంది. దీంతో హైడ్రా విషయంలో కాంగ్రెస్ మరింత ముందుకి వెళ్తే చిక్కులు తప్పేలా లేవని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
మూసీ సుందరీకరణ పేరుతో అక్కడి ప్రజలకు.. ప్రత్యామ్నాయ వసతులను కల్పించి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, ఓ చోట స్థిర నివాసం ఉండి మరో చోటకు వెళ్లేందుకు ప్రజలు అంత త్వరగా అంగీకరించరు. బీఆర్ఎస్ హయాంలో మల్లనసాగర్ ఇష్యూలో ఇదే జరగగా..ఇప్పుడు మూసీ ప్రాంత ప్రజల తరలింపు విషయంలో ఇదే జరగనుంది.
కాగా, హైడ్రా విషయంలో సర్కార్ వెనక్కి తగ్గవద్దని పట్టుదలగా కనిపిస్తోంది. అదే సమయంలో సర్కార్ పట్టుదల బీఆర్ఎస్ కు తిరుగులేని అస్త్రంగా మారుతుంది. పట్టు విడకపోతే కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల ముంగిట మునగడం ఖాయం.. రాజకీయ పరిస్థితులను అంచనా వేసి ప్రభుత్వం వెనక్కి తగ్గితే అది బీఆర్ఎస్ తమ క్రెడిట్ గా చెప్పుకుంటుంది.. వీటన్నింటినీ కాదని ముందుకు వెళ్తే బీఆర్ఎస్ ఫైట్ చేసేందుకు సమాయత్తం అవుతోంది. దీంతో ఈ విషయంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.