మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కాదులెండి! మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఆయన యాత్ర చేస్తారు. ఈ నెల 24 నుంచి యాత్ర ప్రారంభిస్తున్నారు. ఏడు రోజులపాటు సాగే ఈ యాత్రకి పట్నం గోస యాత్ర అని పేరు పెట్టారు. రోజుకో నియోజక వర్గం చొప్పున, వారం రోజులపాటు ఏడు శాసనసభ నియోజక వర్గాల్లో నడుస్తారు. బస్తీలకు వెళ్లి, సమస్యలు తెలుసుకుంటారు. 24న మల్కాజ్ గిరి నుంచి ప్రారంభించి, ఆ మర్నాడు ఎల్.బి.నగర్, ఆ తరువాత ఉప్పల్ మీదుగా యాత్ర సాగుతుంది. ఈ కార్యక్రమంలో ఇతర కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ యాత్ర ద్వారా రెండు రకాల ప్రయోజనాలను పొందాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యంగా చెప్పుకోవచ్చు! మొదటిది, మరో ఏడాదిలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈలోగా నగరంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఇప్పట్నుంచే స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నది రేవంత్ సంకల్పంగా తెలుస్తోంది. పట్నం గోస యాత్ర ముగిశాక కూడా నగరంలో తరచూ పార్టీ తరఫున కార్యక్రమాలు ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈసారి జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేందుకు శ్రేణులను రేవంత్ సిద్ధం చేసే పనిలోపడ్డారని భావించొచ్చు.
రెండో ప్రయోజనం… హైకమాండ్ కి కొన్ని పాజిటివ్ సంకేతాలు అందించడం! జనబలం తనకు దండిగా ఉందని మరోసారి చాటి చెప్పుకునే ప్రయత్నంగానూ చూడొచ్చు! తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఏ క్షణమైనా హైకమాండ్ సిద్ధం కావొచ్చు. నిజానికి, రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నా… పార్టీలో ఆయన అనుభవాన్ని ఎత్తి చూపుతూ కొంతమంది సీనియర్లు హైకమాండ్ కి కొన్ని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాటిని తిప్పికొట్టాలంటే, ప్రజల్లో ఉంటూ తన సత్తా చాటి చెప్పడం కూడా ఈ యాత్ర ద్వారా రేవంత్ ఆశిస్తున్న ప్రయోజనంగా చెప్పొచ్చు. పట్నం గోస యాత్ర పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఘాటైన విమర్శలు చేసే అవకాశమూ ఉంటుంది కదా!