సీఎం రేవంత్ రెడ్డి పవర్ లోకి వచ్చాక… తన దూకుడు మరింత పెంచారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుతున్నా, ప్రతి రోజు కలుస్తున్నా… వలసలను ఆపలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాంతో, సీక్రెట్ గా చేరికల వ్యవహరం నడుపుతున్నారు.
అయితే, చేరికల వల్ల కాంగ్రెస్ కే నష్టం… మా పార్టీలోకి వచ్చిన వారు ఎవరూ గెలవలేదు, పైగా ఎన్నికల నాడు సీట్ల కోసం కొట్లాట తప్పా ఏమీ ఉండదంటూ ఇటీవల హరీష్ రావు కామెంట్ కూడా చేశారు.
కానీ, రేవంత్ వ్యూహాం వేరే ఉంది. 2026లో రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగబోతుంది. జనాభా ప్రాతిపాదికన ఇవి జరగనుండగా… మెజారిటీ సీట్లు కొత్తగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనే రాబోతున్నాయట.
ప్రస్తుతం 24 సీట్లు గ్రేటర్ పరిధిలో ఉంటే… వాటి సంఖ్య 54కు చేరనుందని, భవిష్యత్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు వచ్చిన వారే అధికారాన్ని చేపడతారని అంచనాకు వచ్చారట. అందుకే రేవంత్ సిటీపై ఎక్కువ ఫోకస్ చేసి మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ కిందకు తీసుకరావటం వంటి కీలకమైన నిర్ణయాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇటు చేరికల సందర్భంలోనూ పాత వారికి ఇదే విషయం చెప్తున్నారు. మీ సీటుకు ఢోకా ఉండదు… అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. కలిసి పనిచేసుకోండి… మళ్లీ అవకాశం వస్తుందని పాత ఇంచార్జులకు సూచిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 119 స్థానాలుండగా, పునర్విభజన చట్టం ప్రకారం 153కు పెరగాలి. కానీ, జనాభా ప్రాతిపాదికన సీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.