తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పీకర్ మధుసూధనాచారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో నిన్న ఒక పిటిషన్ వేశారు. తెదేపాలో నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి అభ్యర్ధన మేరకు తెదేపాని తెరాసలో విలీనం చేస్తున్నట్లుగా స్పీకర్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. తమ పార్టీ నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవలసిందిగా కోరుతూ తాము ఇచ్చిన వినతి పత్రాలని పట్టించుకోకుండా ఆ తరువాత ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖపై తక్షణమే స్పందిస్తూ స్పీకర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారణకి స్వీకరించిన హైకోర్టు తెలంగాణా శాసనసభ కార్యదర్శికి మరి కొందరికి రెండు వారాలలో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలా వద్దా? అనేది స్పీకర్ పరిధిలో ఉన్న అంశమే కనుక దానిపై హైకోర్టు కూడా కలుగజేసుకోలేదని ఇదివరకే స్పష్టం అయ్యింది. కానీ తెదేపాని తెరాసలో విలీనం చేయడం అనేది ఆయన పరిధిలోలేని అంశమేనని చెప్పక తప్పదు. ఒక రాజకీయ పార్టీ తనంతట తానుగా తన గుర్తింపుని రద్దు చేయామని కోరినప్పుడు కానీ, వేరే ఏదైనా బలమైన కారణాలు ఉన్నప్పుడు గానీ ఎన్నికల సంఘం దాని గుర్తింపుని రద్దు చేస్తుంది. కానీ తెదేపా విషయంలో ఆ రెండూ జరుగలేదు. నేటికీ తెలంగాణాలో తెదేపా యధాప్రకారం తన కార్యకలాపాలని కొనసాగిస్తూనే ఉంది. అంతేకాదు తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ నేటికీ తెదేపా, కాంగ్రెస్, వైకాపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు కూడా. కనుక ఏ ప్రకారం చూసినా తెదేపాని తెరాసలో విలీనం చేయడం సాధ్యం కాదు. అది తప్పు కూడా. కనుక ఈసారి రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కారణంగా తెరాసకి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి.